ప్రధాని మోడీ హుందాగా వ్యవహరించాలి

మాకేం లెక్క అంటే.. గుణపాఠం చవిచూస్తారు
వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల దీక్షను సపోర్టు చేయకుండా బాబు కుట్ర
టీడీపీ ఎంపీలను ఏసీ బస్సుల్లో తిప్పుతూ పోరాడుతున్నట్లు ఫోజులు
సిగ్గుమాలిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు
చంద్రబాబు కుప్పంలో గెలవడం కష్టమే
ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌ వైయస్‌ జగన్‌
ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఐదు మంది ఎంపీలే కదా దీక్ష చేసేది.. మాకేం లెక్క అనే ధోరణితో మోడీ వ్యవహరిస్తే.. తగిన గుణపాఠం చవిచూస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. దేశ రాజధానిలో ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షలను కేంద్రం పట్టించుకుంటుందా.. లేదా.. అనేది ప్రజలంతా గమనిస్తున్నారని, దీనికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పిస్తారన్నారు. ఢిల్లీలో రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో డాక్టర్ల సలహా మేరకు పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారన్నారు. అయినా వైవీ ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తుండడంతో డాక్టర్లు బలవంతంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నారన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఇది చాలా దురదృష్టకరమని, దీక్షలపై స్పందించకపోవడం ఆంధ్రరాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల దీక్ష రాష్ట్ర ప్రజలను హోదా బాటపై నడుపుతుందనే దురుద్దేశంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. ఎయిర్‌పోర్టు వరకు వెళ్లిన టీడీపీ ఎంపీలను వెనక్కు రప్పించి ప్రధాని మోడీ ఇంటికీ.. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్దకు ఏసీ బస్సుల్లో తిప్పుతూ.. పోరాటాలు చేస్తున్నట్లుగా చిత్రీకరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఎన్నికలు వస్తే చంద్రబాబు కుప్పంలో కూడా గెలవడం కష్టమేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధంగా, హోదాను నీరుగార్చే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. 

ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  హోదా సాధన కోసం వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారన్నారు. గుంటూరులో 8 రోజుల పాటు ఆమరణ దీక్ష, యువభేరీలు, ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ప్రజలు, యువతలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ప్రత్యేక హోదా క్రెడిట్‌ అంతా వైయస్‌ జగన్‌కు వెళ్తుందనే కుట్రతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా అడుగుతున్నారని, ఇంత సిగ్గుమాలిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top