ఓడిపోతామని తెలిసే సుహాసినిని పోటీ చేయించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార‍్వతి మండిపడ్డారు.  ఓడిపోతామని తెలిసే కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినిని టీడీపీ తరపున చంద్రబాబు పోటీలో నిలబెట్టారని ఆరోపించారు. నెల్లూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందని అన్నారు.టీడీపీ ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరగుతోందన్నారు. రాజధాని, నీటి ప్రాజెక్టులలో అవినీతి ఏరులై పారుతోందన్నారు. ప్రతి పథకంలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల అవినీతికి హద్దే లేకుండా పోతోందని దుయ్యబట్టారు.

అవినీతి సొమ్ముతో తెలంగాణాలో ప్రజలను కొనాలకున్నారు.. కానీ ఓటర్లు మాత్రం దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు చంద్రబాబును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాం వెల్లడించిన వివరాలతో ప్రజలు విస్తు పోతున్నారని అన్నారు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యంగా వర్ణించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆమెను దేవతగా భావిస్తున్నారని చెప్పి చంద్రబాబు తీరును ఎండగట్టారు. టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందని, సీఎం రమేష్‌, సుజానా చౌదరీల భాగోతం ద్వారా అది తెలిసిందన్నారు. త్వరలోనే లోకేష్‌ బాబు బండారం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందన్నారు.


Back to Top