రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

ప్రకృతి ప్రేమికుడు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి
మహానేత హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది
చంద్రబాబు ప్రకృతి వనరుల విధ్వంసకుడు
ప్రకృతి ప్రేమికుడు వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే వ్యవసాయం పండుగ
రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు 
హైదరాబాద్‌: రైతు సంతోషంగా ఉంటేనే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత దేశంలో రాజకీయ నాయకులలో జాతీయ స్థాయిలో రైతు నాయకులుగా పేరొందిన ప్రముఖ వ్యక్తులు మాజీ ఉప ప్రధాని దేవీలాల్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్‌ సింగ్‌ అని గుర్తు చేశారు. భూస్వాముల వడ్డీ వ్యాపారుల కబంద హస్తాల నుంచి రైతులను కాపాడటానికి చరణ్‌సింగ్‌ అనేక కార్యక్రమాలను అమలు చేశారన్నారు. డిసెంబరు 23 చరణ్‌ సింగ్‌ పుట్టిన రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించుకుని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. 

జాతీయ రైతు దినోత్సవాన్ని జరిపించడానికి కూడా పాలకులకు మనసు రావడం లేదని ఎంవీఎస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఎవ్వరినీ మోసం చెయ్యని, మోసం చేసే ఆలోచన కూడా లేని వ్యక్తి రైతు అని, రైతు సంతోషంగా ఉంటేనే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతు సంతోషంగా ఉండాలంటే ప్రకృతి అనుకూలత, ప్రభుత్వ విధానాలు ఉండాలన్నారు. ప్రకృతి అనుకూలిస్తే వ్యవసాయం పండుగలా ఉంటుంది. పాలకులు ప్రకృతి ప్రేమికులుగా ఉంటేనే ఇది సాధ్యమన్నారు. 

ప్రకృతి ప్రేమికుడు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సకాలంలో వర్షాలు, వాయువేగాలు, ఉష్ట్రోగ్రతలు అనుకూలంగా ఉండి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు పెరగడంతోపాటు, వాటికి మించి మార్కెట్‌ ధరలు ఉండేవన్నారు. ఎరువుల ధరల నియంత్రణ, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ లాంటి
కార్యక్రమాలతో వ్యవసాయం పండుగలా మారి గ్రామీణ ప్రాంతాలలో సంపద పెరగడంతో భూముల ధరలు గణనీయంగా పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వనరుల విధ్వంసకుడుగా చంద్రబాబు నాయుడు మారారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 పంట కాలాల్లో ప్రతి యేటా కరువు–తుపానులే రైతు వెన్ను విరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రకృతి వికృత రూపం దాల్చి గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు తగ్గిపోవడం, నియంత్రించలేని తెగుళ్లతో, వర్షాభావంతో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోయి, రైతుకు దక్కిన అరకొర దిగుబడులకు సైతం ఉత్పత్తి వ్యయం కంటేæ 20 శాతం తక్కువగా కనీస మద్దతు ధరలు ఉండటం, కనీస మద్దతు ధరలను అమలు చేయని పరిస్థితులు నెలకొనడంతో రైతులు అప్పులపాలై, ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టివేయబడి, పక్క రాష్ట్రాలకు దినసరి కార్మికులుగా వలసపోతున్న దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయన్నారు. 

రాబోయే వ్యవసాయ సీజన్‌ మొదలయ్యే జూన్‌1 నాటికి రాష్ట్రంలో ప్రకృతి ప్రేమికులుగా ఉండే కొత్త ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. అప్పటి నుంచి మరలా ప్రకృతి, ప్రభుత్వ విధానాలు మహానేత రాజశేఖరరెడ్డి పాలనలో మాదిరిగా రైతులకు అనుకూలంగా మారి.. 2019 డిసెంబరు 23న వచ్చే జాతీయ రైతు దినోత్సవం సంతోషంగా జరుపుకునేలా దీవించమని ప్రకృతి పంచశక్తులనూ, భగవంతుడిని వేడుకున్నారు. జీవితకాలం రైతుల కోసం పనిచేసిన రైతు నాయకులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు పాదాభివందనాలు తెలియజేస్తూ రైతు సోదరులందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
తరఫున జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
Back to Top