పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీని ఎందుకు అరెస్టు చేయడం లేదు

వ్యవస్థల మీద కాదు చంద్రబాబుపై నమ్మకం లేదు
విచారణ జరిపించలేక వైయస్‌ఆర్‌ సీపీపై దుష్ప్రచారం
నిమిషాల్లో సంక్రాంతి పోస్టర్, సమాచారం ఎలా సాధ్యం
వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం టీడీపీ కుట్రే
చంద్రబాబు అనుభవం అంతా హత్యారాజకీయాలే..
విజయవాడ: పోలీస్‌ వ్యవస్థ, శాసనసభపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రగాఢ విశ్వాసం ఉందని, కానీ చంద్రబాబుపైనే నమ్మకం లేదని పార్టీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఈ నెల 25వ తేదీని దుర్దినంగా వైయస్‌ఆర్‌ సీపీ భావిస్తుందన్నారు. జరిగిన దాడిపై నిస్పక్షపాత విచారణ జరిపించలేని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. వైయస్‌ఆర్‌ సీపీపై దు్రర్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీ పోలీసులపై వైయస్‌ఆర్‌ సీపీకి నమ్మకం లేదని ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనంతా హింసాకాండ అని, మల్లెల బాబ్జి, ఎలిమినేటి మాధవరెడ్డి, వంటవీటి మోహనరాంగా, పింగళి దశరథ్‌రామ్‌ హత్యలు బాబు పాలనలోనే జరిగాయన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత తనపై కేంద్రం దాడులు చేయిస్తుందని, ప్రజలంతా రక్షణగా ఉండాలని కోరిన చంద్రబాబు.. ప్రతిపక్షనేతపై జరిగిన విషయంలో ఎంత నీచంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారన్నారు. 
 
బీజేపీ ప్రోద్బలంతో వైయస్‌ జగన్‌ ఇంట్లో మీటింగ్‌ పెట్టుకొని ఆస్పత్రిలో చేరారని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. హత్యాయత్నం జరిగినా కార్యకర్తలు అధైర్యపడతారని చిరునవ్వు చెరగకుండా హైదరాబాద్‌కు చేరుకొని నేరుగా ఆస్పత్రికి వెళ్లి వైయస్‌ జగన్‌ చికిత్స పొందారన్నారు. కానీ టీడీపీ నేతలు చేసే నీచపు వ్యాఖ్యలు చూస్తే వారిలో మానవత్వం కూడా లేదని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ను హత్య చేయించాలని కుట్ర పన్నిన తెలుగుదేశం గురితప్పడంతో నేరం కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేస్తుందన్నారు. జననేతపై హత్యాయత్నం జరిగిన గంటలో సంక్రాంతి పోస్టర్‌ తయారు చేశారని, ప్రభుత్వం దురాలోచన ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. హడావుడిగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి వైయస్‌ఆర్‌ సీపీకి, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. 

ఆపరేషన్‌ గరుడ గురించి లీకులు ఇచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజాదరణ కలిగిన నాయకుడని, పాదయాత్రలో లక్షల్లో జనం తరలివస్తున్నారని ఓర్వలేక వైయస్‌ జగన్‌ను మట్టుబెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. ప్రతిపక్షనేత మీద జరిగిన దాడిపై జాలి కూడా లేకుండా పరామర్శించిన వారిని తప్పుబట్టడుతున్నాడని, వైయస్‌ జగన్‌ను వాడు వీడు అంటూ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా చంద్రబాబూ మీ 40 సంవత్సరాల అనుభవం.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  
Back to Top