విజయవాడ: ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 24న వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతివ్వాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మల్లాది విష్ణు కోరారు. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బంద్‌లో భాగస్వామి కావాలని హితవు పలికారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం హోదాను తుంగలో తొక్కారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా హోదా విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. హోదా కోసం వైయస్ జగన్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతిస్తుందని చెప్పారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని సూచించారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే కచ్చితంగా హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.