రైతుల సమక్షంలో పట్టిసీమపై చర్చకు సిద్ధం

దమ్ముంటే దేవినేని సవాల్‌ స్వీకరించాలి
వ్యవసాయాన్ని నాశనం చేసి ధాన్యం బస్తా అడుగుతారా..?
నాలుగేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పించారా..?
చంద్ర‌బాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణాలు గాల్లోకి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌

విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణాడెల్టాకు ఎంత నీరిచ్చారో.. ఎన్ని ఎకరాల పంటను రక్షించారో చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై చర్చకు రావాలని జోగి రమేష్‌ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమాకు సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఇరిగేషన్‌ మంత్రి సొల్లు కబుర్లు చెప్పకుండా సవాల్‌ స్వీకరించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఒరిగేందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోచుకోవడం.. దాచుకోవడంపై ఉన్న ఆరాటం.. చంద్రబాబుకు రైతులపై లేదన్నారు. రైతు రుణమాఫీ పూర్తి చేశామని చంద్రబాబు, వ్యవసాయ శాఖామంత్రి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ. 84 వేల కోట్లు అయితే.. అసెంబ్లీ సాక్షిగా రూ. 24 వేల కోట్లు రుణ మాఫీ చేశామని చెబుతున్నారన్నారు. టీడీపీ రుణమాపీ రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రుణమాఫీ పూర్తి చేస్తే రైతులు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు.
ధాన్యం ఎందుకివ్వాలి..?
వ్యవసాయం దండగని చెప్పిన నోటితే చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను ధాన్యం, డబ్బు, బాండ్‌ అడుగుతున్నారని నిలదీశారు. నాలుగేళ్లుగా ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పించావా..? ఏ పంటకైనా సకాలంలో నీరు అందించావా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు. బాబు పాలనలో ఆఖరికి మామిడి తోటలు కూడా పెకిలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. హెరిటేజ్‌ సంస్థలో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి కదా.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వానికి మళ్లించలేరా చంద్రబాబూ అని నిలదీశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకోవచ్చు గానీ.. ఇక్కడున్న రైతులు మాత్రం కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మీకివ్వాలా చంద్రబాబూ అని ప్రశ్నించారు.
కృష్ణా డెల్టాపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..?
పట్టిసీమ ద్వారా నీరిచ్చి కృష్ణాడెల్టా రైతాంగాన్ని ఆదుకున్నామని పదే పదే చెబుతున్నారని, ఏ ప్రాంతానికి నీరిచ్చారో చెప్పాలని జోగి రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లుగా ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించారో.. వ్యవసాయమంత్రి చెప్పాలని, అదే విధంగా పట్టిసీమ ద్వారా ఏఏ ప్రాంతాలకు నీరందించారో.. మంత్రి దేవినేని చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాలకు నీరు ఇవ్వగలిగావా దేవినేని ఉమా అని ప్రశ్నించారు. దేవినేని ఉమకు దమ్ముంటే సొల్లు కబుర్లు చెప్పడం మాని సవాల్‌ను స్వీకరించాలన్నారు. మీడియా ప్రతినిధులు, రైతుల సమక్షంలో చర్చిద్దామన్నారు. ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ సొంత నియోజకవర్గం మైలవరానికి సాగర్‌ జలాలు తీసుకురావడంలో విఫలమయ్యాడన్నారు.
బాబంటే ప్ర‌కృతికీ భ‌య‌మే..
చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించడం లేదని జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుందన్నారు. బాబు ముఖ్యమంత్రి కాగానే హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చిందని, గోదావరి పుష్కరాల్లో బాబు డాక్యుమెంటరీకి పుణ్యస్నానాలకు వచ్చిన 30 మంది భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారని, గుంటూరులో డయేరియాతో 10 మంది, కృష్ణానదిలో పడవ బోల్తా పడి 17 మంది.. ఇలా బాబును ప్రకృతి కూడా చీదరించుకుంటుందన్నారు. తాజాగా ఒంటిమిట్ట రామాలయంలో కనులపండువగా కల్యాణం జరుగుతుంటే.. చంద్రబాబు రాగానే ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు.
సీబీఐ విచార‌ణంటే బాబుకు భ‌యం
చంద్రబాబు పిరికితనం, ఒంటరితనం అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బయటపడుతున్నాయని జోగి రమేష్‌ అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మాటలను సొంత పార్టీ నాయకులు, మిత్రపక్షాల వారు విశ్వసించడం లేదన్నారు. అవినీతితో వందల కోట్లు సంపాదించిన చంద్రబాబు తనపై సీబీఐ ఎంక్వైరీ వేస్తారని, తనను జైలుకు పంపిస్తారని బేలగా మాట్లాడుతున్నారన్నారు. తప్పు చేయని వాడివైతే భయమెందుకు చంద్రబాబూ అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని మొదటి నుంచి  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చెబుతున్నారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ మాటలను ప్రజలంతా వేదంగా భావిస్తున్నారన్నారు. అందుకే బాబు అవినీతిపై బీజేపీ, పాట్నర్‌ పవన్‌ కూడా మాట్లాడుతున్నారన్నారు.

Back to Top