సుజనాపై పవన్‌ స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటో?

 విశాఖపట్నం : టీడీపీ ఎంపీ సుజనా చౌదరి దోపిడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించట్లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. వేల కోట్లు రూపాయలను అక్రమంగా దోచుకున్న సుజనాపై పవన్‌ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని నిల‌దీశారు.  మంగళవారం ఆయన విశాఖ‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో నాలుగు కోట్లు విలువచేసే భూమిని కేవలం 20 లక్షలకే మీకు కట్టబెట్టినందుకు మాట్లాడంలేదా? అని విమర్శించారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలను ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం సరికాదన్నారు.

మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలపై పోరాడుతానని గొప్పలు చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌.. తమ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే ఎక్కడపోయారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.Back to Top