ఇంకెంతకాలం బాబూ నీ మోసం

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తొచ్చిందా?
దోపిడీ చేసేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రాజెక్టుకు శంకుస్థాపన
తోటపల్లి ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ 96శాతం పూర్తి చేశారు
మిగిలిన 4 శాతం పూర్తి చేయలేని దుర్మార్గపు ప్రభుత్వం
వైయస్‌ జగన్‌ చేతుల మీదుగానే సుజల స్రవంతి పూర్తవుతుంది
హైదరాబాద్‌: మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు ఉత్తరాంధ్రపై కొత్త ప్రేమ వలకబోస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2009 ఫిబ్రవరి 21వ తేదీన శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన పేరుతో చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని మహానేత సుజల స్రవంతిని తీసుకువచ్చారన్నారు. 2014లో వైయస్‌ఆర్‌ జలయజ్ఞంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, దేవినేని ఉమా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. 

చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తుకువచ్చిందా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈరోజు ఆ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు శంస్థాపన చేయడానికి సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబుూ ఉత్తరాంధ్ర ప్రజలను ఎందుకు మభ్యపెడతారని నిలదీశారు. ఇదే విధంగా తోటపల్లి రిజర్వాయర్‌ కు కూడా 2004లో కూడా చంద్రబాబు తోటపల్లికి ప్రాజెక్టుకు చేసి మూడు ఇటుకలు వేసి రూ. 3 కోట్లు కూడా కేటాయించకుండా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైయస్‌ఆర్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసిందన్నారు. మిగిలిన 4 శాతం ఇప్పటికీ చంద్రబాబు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టడానికే కాకుండా ధన దాహం కోసం టెండర్లు పిలవగా వచ్చిన అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, దేవినేని ఉమా శ్వేతపత్రం విడుదల చేశారని, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా ఇస్తే మొత్తం 54 ప్రాజెక్టులు ఉన్నాయని,  ఇప్పటికి 14 పూర్తయ్యాయని చెప్పారన్నారు. ఇంకా 40 ఉన్నాయి వాటిని పూర్తి చేయడానికి రూ. 17,348 కోట్లు సరిపోతాయని నివేదిక రిలీజ్‌ చేశారన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌ మంత్రి ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, రూ. 17 వేల కోట్లకు పూర్తవుతాయని చెబుతున్న పెద్ద మనుషులు రూ. 52 వేల కోట్లు ఖర్చు చేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారని ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టు ఖర్చు మినహాయిస్తే మిగతాదంతా రూ.17 వేల కోట్లు పూర్తి చేస్తానని చెప్పారో దానికి సుమారు మూడు రెట్లు అధనంగా ఖర్చు చేశారన్నారు. ఏ రకంగా దోపిడీ జరిగిందో.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని ఏ విధంగా దోచిపెట్టారో ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఇంత ఖర్చు చేసినా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. తోటపల్లి ప్రాజెక్టును 4 శాతం కూడా పూర్తి చేయలేని దుర్మార్గ ప్రభుత్వం. ఇవాళ మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు సుజల స్రవంతికి శంకుస్థాపన గుర్తుకు వచ్చిందన్నారు. మొదటి దశ రూ. 809 కోట్లతో నిర్మాణం అనుకుంటే దాన్ని రూ. 2 వేల కోట్లకు రెండు వందల శాతానికి పెంచారని మండిపడ్డారు. సుజల స్రవంతిలో దోపిడీ తప్ప నిర్మాణం ఉండదని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. 

ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయని, ప్రజల ఆదరాభిమానాలతో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. వైయస్‌ఆర్‌ కల, ఉత్తరాంధ్ర ప్రజల కోరిక వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పూర్తవుతుందన్నారు. ఎక్కడా అవకతవకలు లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. చంద్రబాబులా మోసం చేయడం వైయస్‌ఆర్‌ సీపీకి తెలియదని, ప్రజలకిచ్చిన వాగ్ధానాలు చిత్తశుద్ధితో నెరవేరుస్తామన్నారు. 
Back to Top