స్థానిక సంస్థలకు సమాంతరంగా జన్మభూమి కమిటీలు

-  ఏపీలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
-  వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి పాలనలో పంచాయితీలకు కరెంట్ బిల్లుల‌ మినహయింపు 
  
 విజయవాడ: స‌్థానిక సంస్థ‌ల‌కు స‌మాంత‌రంగా జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను న‌డుపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌ విభాగం అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు.  చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తుందని ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌వ‌డ‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ పంచాయతీరాజ్‌లకు సువర్ణ అధ్యాయం ప్రారంభమైన రోజన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్ రెడ్డి పాలనలో పంచాయితీల కరెంట్ బిల్లులు చెల్లించకుండా మినహయింపు ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే పంచాయితీలు కూడా కరెంట్ బిల్లులు కట్టాలంటూ వచ్చిన డబ్బుల్ని లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సమాంతరంగా జన్మభూమి కమిటీలను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న వారిని పక్కన పెట్టి పార్టీ నాయకులతో స్థానిక సంస్థల్ని నడపటం చాలా దారుణమన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుందన్నారు. పంచాయ‌తీల్లో కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు లేవన్నారు. కార్మికులు జీతాలు ఇవ్వకుండా స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఎక్కడ నుంచి వస్తుందన్నారు. మంత్రి లోకేష్‌ పంచాయితీల్లో రోడ్లు వేశామని చెబుతున్నారు.. ఎక్కడ వేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఉద్యోగులు కడుపుమంటతో రగిలిపోతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని .. దయచేసి స్థానిక సంస్థల్ని బతుకనివ్వాలని ఆయన కోరారు.

 
Back to Top