హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్‌గా (ఎన్నికల చిహ్నంగా) సీలింగ్ ఫ్యాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అదే గుర్తుపై రాష్ట్రంలో పలు ఉప ఎన్నికలలో పోటీ చేసింది. 2011 మే నెలలో కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తుతోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. తర్వాత 2012 మార్చిలోనూ, జూన్‌లోనూ జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభా స్థానంతో పాటు 16 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సీలింగ్ ఫ్యాన్ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.
తరువాత పార్టీ ప్రమేయం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీగా విజయం సాధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికల్లో కామన్ సింబల్‌గా సీలింగ్ ఫ్యాన్ గుర్తునే కేటాయించాలని కోరుతూ డిసెంబర్ 1న, 3న పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు రాశారు. ఎలక్షన్ సింబల్సు (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్-1968 ప్రకారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఈసీ కేటాయించింది.
సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ, 294 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సీలింగ్ ఫ్యాన్‌నే ఉమ్మడి గుర్తుగా కేటాయిస్తారు. ఈ మేరకు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జారీచేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈసీ సమాచారం పంపింది.