వరంగల్ లో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ

16 నుంచి జిల్లాలో వైఎస్ జగన్ ప్రచారం
వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

వరంగల్ః ఓరుగల్లు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. జిల్లాలో వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.  అధ్యక్షులు  వైఎస్ జగన్ వరంగల్ జిల్లా పర్యటనకు రానుండడంతో పార్టీ శ్రేణులు మరింత ఆనందోత్సాహంతో ఉన్నాయి. రెట్టించిన ఉత్సాహంతో కేడర్ ప్రచార జోరు కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరపున జననేత  వైఎస్ జగన్ ఈనెల 16 నుంచి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు.

16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ జగన్ ప్రచారం చేపడుతారు.16న హైదరాబాద్ నుంచి జనగామకు చేరుకోనున్న జగన్.. పాలకుర్తి, జఫర్‌గఢ్, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ మండలాల్లో ప్రచారం చేస్తారు. 17న హన్మకొండ, ఆత్మకూరు, రేగొండ, భూపాలపల్లి, చెన్నరావుపేట, పరకాల మండలాల్లో... 18న హన్మకొండ, సంగెం, గీసుగొండ మండలాల్లో పర్యటిస్తారు.  అదే రోజు హన్మకొండలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 19న హన్మకొండ, నయీంనగర్, కేయు క్రాస్‌రోడ్డు, కాజీపేట, మడికొండతో పాటు ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి మండలాలలో జగన్ ప్రచారం చేస్తారు.

ఇప్పటికే  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మూడ్రోజుల పాటు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలన్నీ దక్కాలంటే అది వైఎస్సార్సీపీతోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపు తథ్యమని, భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   
Back to Top