సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో వాయిదా తీర్మానం

హైదరాబాద్, 11 డిసెంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గురువారంనాడు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లోట‌స్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌ సీఎల్పీ సమావేశం బుధవారం జరిగింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమా‌ర్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్ర రైతాంగానికి జరిగే అన్యాయం, కరెంటు చార్జీల పెంపు, వరుస తుపానుల వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను, ఆకాశాన్ని అంటుతున్న అధిక ధరల అంశాన్ని శాసనసభ సమావేశాల్లో చర్చకు తేవాలని వైయస్ఆర్‌ సీఎల్పీ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశం వివరాలను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మీడియాకు తెలిపారు.

అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి ప్రభుత్వం అంగీకరించకపోతే, శుక్రవారంనాడు ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని భూమన చెప్పారు. దీనితో ఎవరు సమైక్యవాదులో, విభజన వాదులెవరో తేలిపోతుందని ఆయన చెప్పారు. సమైక్యం ముసుగులో విభజనకు తోడ్పడుతున్న ద్రోహులెవరో తేలాలన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు గంగిరెద్దులాగా తలూపి విభజనకు సహకరించారని, ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని చూసి తర్వాత 15 రోజులకు నిద్రలేచి సమైక్యరాగం ఆలపించారని కరుణాకరరెడ్డి దుయ్యబట్టారు. ఆ తరువాత 60 రోజుల సుదీర్ఘ నిద్రలోకి వెళ్లి ఇపుడు సమైక్యం అంటూ హడావుడి చేస్తున్నారన్నారు.

రాష్ట్రాన్ని చంద్రబాబే చీల్చేయమన్నారు :
రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరిచిప్పల సిద్ధాంతం, ఇద్దరు పిల్లల సిద్ధాంతాలను వల్లె వేస్తూ రాష్ట్రాన్ని చీల్చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి చెప్పారని భూమన, కాపు పేర్కొన్నారు. ప్రణబ్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి షిండేకు కూడా రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారని, ఇప్పటికీ ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడం లేదన్నారు. కొందరు టీడీపీ ఎంపీలు విభజనకు హేతువైన చంద్రబాబు వైఖరిని ప్రశ్నించకుండా సమైక్యం అంటూ జిమ్మిక్కులు చేయడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు.

వైయస్ఆర్ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, భూమా శోభా‌ నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, సి. ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top