వైయస్‌ఆర్‌సీపీ ఖాతాలోకి మునగపాక ఎంపీపీ పదవి

 
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోకి విశాఖ జిల్లా మునగపాక ఎంపీపీ పదవి చేరింది.  మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా నాగవరం ఎంపీటీసీ దాసరి గౌరీలక్ష్మీ ఏకగ్రీకంగా ఎన్నికయ్యారు.  2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైయస్‌ఆర్‌సీపీకి 8, టీడీపీకి 8 స్థానాలు వచ్చాయి. దీంతో మండల అధ్యక్ష , ఉపాధ్యక్ష పదవులను చేరి రెండున్నర సంవత్సరాలు చేపట్టేలా ఇరు పార్టీల స్థానిక నేతలు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఎంపీపీగా టీడీపీకి చెందిన ఆడారి మంజు పదవి చేపట్టారు. గతేడాది జనవరి 5వ తేదీతో మంజు పదవీ కాలం ముగిసింది. అయినా కూడా ఆమె రాజీనామా చేయకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఎట్టకేలకు దిగి వచ్చిన టీడీపీ నేతలు డిసెంబర్‌ 26న మంజుతో రాజీనామా చేయించారు. జెడ్పీ సీఈవో జయప్రకాశ్‌ ఆదేశాల మేరకు గురువారం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షురాలిగా గౌరీలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
 
Back to Top