సమైక్య వాదం ముసుగులో కిరణ్ దోపిడీ

హైదరాబాద్:

సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘దోపిడీవాదం’ కొనసాగిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభా‌ పక్షం ఆరోపించింది. గత ఏడాది జూలై 30న రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనను గాలికి వదిలేసి పగలు, రాత్రి ఫైళ్లపై రెండు చేతులతో సంతకాలు చేస్తూ దోపిడీవాదాన్ని కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందిది. కిరణ్‌కుమార్‌రెడ్డి దోపిడీకి పాల్పడకుంటే తక్షణం స్వతంత్రంగా విచారణకు ముందుకు రావాలని సవాల్ చేసింది. లేదంటే సమైక్యవాద ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నట్లు కిర‌ణ్ ఒప్పుకోవాలని సూచించింది. వై‌యస్ఆర్‌సీపీ శాసనసభా పక్షం ఉపనాయకుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి టి.బాలరాజు, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‌ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత జూలై 30 నుంచి ఇప్పటి వరకు ఫైళ్ళపై చేసిన సంతకాలు, విడుదల చేసిన జీఓలను వెల్లడించాలని సమాచార హక్కు చట్టం కింద వైయస్ఆర్‌సీపీ శాసనసభా పక్షం దరఖాస్తు చేసినట్లు వారు తెలిపారు. భూమి బదలాయింపులు, భూమి కేటాయింపులు, గుత్తేదార్లకు అప్పనంగా ధారాదత్తం చేసిన ప్రజాధనం, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖలో తీసుకున్న నిర్ణయాలపై సమాచారం కోరినట్లు చెప్పారు. ఈ వివరాలు అందిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన దోపిడీపై చట్టపరంగా పోరాడి ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని ప్రకటించారు. సీఎం కిరణ్ దోపిడీకి పాల్పడ‌కపోతే ఈ 7 నెలల కాలంలో చేసిన కార్యక్రమాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

‌రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిస్తే సీఎం కిరణ్ దానిని వక్రీకరిస్తూ సీపీఐ నాయకుల వద్ద నిరాధారమైన నిందలను మోపడాన్ని తీవ్రంగా కృష్ణదాస్, బాలరాజు, శ్రీనివాసరెడ్డి ఖండించారు. శ్రీ జగన్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు బురదచల్లి లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న మాదిరిగానే వారి రహస్య మిత్రు‌డు కిరణ్ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుందని పేర్కొన్నారు. టీడీపీ స్క్రిప్టును పక్కాగా అమలు చేస్తూ కిరణ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ‌శ్రీ జగన్‌పై చేసిన ఆరోపణలకు కిరణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతా‌రని వారు హెచ్చరించారు.

Back to Top