'పంచాయతీల్లో విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌దే'

చింతలపూడి (ప.గో.జిల్లా) :

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగరేస్తుందని పార్టీ చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చింతలపూడిలో ఆయన ‌మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ని గెలిపించటం ద్వారా మహానేత డాక్టర్ వై‌యస్‌పై తమకు ఉన్న అభిమానాన్ని ప్రజలు స్పష్టంగా వెల్లడిస్తారని రాజేష్‌ పేర్కొన్నారు.

పార్టీలో నాయకులు, కార్యకర్తలతో చర్చించి సర్పంచ్ అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ‌ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నచోట స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి కానుకగా అందించాలని కార్యకర్తలకు రాజేష్ పిలుపునిచ్చారు.

‌అధికార, ప్రతిపక్ష పార్టీలు ధన, అధికార బలంతో గెలవాలని ఎత్తులు వేస్తున్నాయని, వాటి ఆటలు సాగనివ్వబోమని రాజేష్‌ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని కార్యకర్తలు పనిచేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశారు.

పార్టీలోకి చేరికలు : జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్, ఎన్‌టిఆర్ నగ‌ర్‌కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు సుమారు 200 మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ నాయకుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో చేరిన వీరికి మద్దాల రాజేష్ కుమా‌ర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో కనుపర్తి వేణుమాధవ్ ఆధ్వ‌ర్యంలో  కూడా వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు రాజేష్‌కుమార్ సమక్షంలో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Back to Top