పార్టీ అధికారంలోకి వచ్చాక కేసులు ఎత్తేస్తాం

హైదరాబాద్ 08 ఆగస్టు 2013:

సమైక్య ఆంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్న వారిపైన పెట్టిన కేసులను మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎత్తేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎమ్.వి.మైసూరా రెడ్డి ప్రకటించారు. విగ్రహాలు కూల్చిన వారికి మూడేళ్ళ జైలనీ, కేసులు పెడతామనీ పోలీస్ బాస్ అయిన డీజీపీ బెదిరిస్తుండటాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని చెప్పారు.

అదో పవర్ లెస్ కమిటీ

రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీని పవర్ లెస్ కమిటీగా మైసూరా రెడ్డి అభివర్ణించారు. అతి చెత్త కమిటీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి ఏవిధంగా ఉంటుందనే అంశాన్ని సూచించడానికి తప్ప ఎందుకూ పనికిరాదన్నారు. ఇది వారి పార్టీకే తప్ప ప్రజలకు సంబంధించినది కాదని స్పష్టంచేశారు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందుకు మాత్రమే ఇది సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం ఉపయోగపడదని పేర్కొన్నారు. ఈ కమిటీకి విన్నవించుకోవడమంటే చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉంటుందన్నారు. అంతకు మించి ఒరిగేదేమీ ఉండదని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిలాషని సీడబ్ల్యూసీ నిర్ణయంగా చెబుతున్నారన్నారు. నిర్ణయం తర్వాత కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగడం కూడా ఓ డ్రామా అని మైసూరారెడ్డి చెప్పారు. నిర్ణయం తీసుకున్న నాయకురాలికి నచ్చచెప్పి, అది మార్చేలా చూడడం మాని, ఆందోళనలతో విభజన సమస్య పరిష్కారం కాదన్నారు. పార్టీ నిర్ణయం శిరసావహిస్తామని అంటూనే.. రాజీనామాలు చేస్తామంటూ ప్రహసనం సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది కూడా ప్రజలను మభ్యపెట్టడానికే పనికొస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారని చెప్పారు.

గవర్నరు దగ్గరకెళ్ళి రాజీనామాలివ్వండి

తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఏపీ ఎన్జీఓలు కలిసినప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేనని తెలిపిన విషయాన్ని మైసూరా రెడ్డి గుర్తుచేశారు. దీనిని మరిచిపోయి టీడీపీ ఎంపీలు అటు రాజ్యసభ, ఇటు లోక్ సభల్లో ఆందోళన చేస్తున్నారనీ, దాన్ని మాని తమ అధినేత నిర్ణయాన్ని మార్చేలా ఒత్తిడి తేవాలనీ ఆయన సూచించారు. వారి చర్య కూడా ప్రజలను మభ్యపెట్టేందుకేననే అంశం వెల్లడవుతోందని చెప్పారు. నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గవర్నరు దగ్గరకు వెళ్ళి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెబితే ప్రభుత్వం కూలిపోతుంది... ఆ విషయం గమనించకుండా నాటకాలు ఆడడమెందుకని తీవ్రంగా ప్రశ్నించారు. రాజీనామాలను తీసుకెళ్ళి పీసీసీ అధ్యక్షుడికి ఇవ్వడం నాటకం కాక ఇంకేమిటన్నారు. ఇది ప్రజా సమస్యలను పరిష్కరించకుండా వారితో ఆటలాడుకోవడమేనని పేర్కొన్నారు.


నీటి సమస్య ఎలా పరిష్కరిస్తారు

రాష్ట్ర విభజన అంశాన్ని అంతర్గత వ్యవహారంగానే కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోంది తప్ప ప్రజలకు సంబంధించిన విషయంగా చూడటం లేదన్నారు. రాష్ట్ర విభజన చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో ప్రజల ముందుకు వెళ్లి ఉంటే బాగుండేదన్నారు.

జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు పంపిణీ అవుతాయన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం వాస్తవ రూపాన్ని దాల్చినప్పుడు ఈ ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారతాయని చెప్పారు. దీనివల్ల తీవ్రమైన నీటి సమస్య తలెత్తుతుందన్నారు. రాయలసీమలో ఉన్న తెలుగు గంగ, గాలేరు,హంద్రీ-నీవా, తెలంగాణలో ఉన్న ఎలిమినేటి మాధవ రెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడుకు గానీ కృష్ణా మిగులు జలాలే దిక్కనే విషయం మరువకూడదని చెప్పారు. వీటికి ప్రత్యేకంగా జలాల కేటాయింపు లేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ సమయంలో కూడా వీటికి నీటిని కేటాయించని విషయాన్ని గుర్తుచేశారు. ఈమధ్య వేసిన బ్రిజేష్ కమిటీలో కూడా వీటికి కేటాయింపు లేవన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఇలాంటి అంశాలే ఉన్నాయన్నారు. ఈ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అంశంపై స్పష్టత లేదన్నారు. వీటిని పట్టించుకోకుండా వేసిన హైలెవెల్ కమిటీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీగానే తాను భావిస్తున్నట్లు మైసూరా రెడ్డి తెలిపారు. అతి ముఖ్యమైన రాజధాని అంశంపై కూడా సీడబ్ల్యూసీ తీర్మానంలో ప్రస్తావన లేదన్నారు. మూడు ప్రాంతాలవారితో మాట్లాడి దీనిని పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ ఇది కాదని మైసూరా రెడ్డి చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top