వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

హైదరాబాద్, 25 జూలై 2013:

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి, ఓట్లూ.. సీట్లూ ప్రాతిపదికగానే ఆలోచిస్తున్న దాని తీరుకు నిరసనగా శాసనసభ్యత్వానికి 16 మంది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గురువారంనాడు రాజీనామా చేశారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టంచేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో తమ రాజీనామా లేఖలను ఫ్యాక్సు ద్వారా స్పీకర్కు పంపించారు.‌

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే బి. గుర్నాథరెడ్డి ముందుగా తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపించారు. అనంతరం భూమా శోభా నాగిరెడ్డి - ఆళ్ళగడ్డ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి - కోవూరు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి- ఉదయగిరి, ఎ. అమరనాథరెడ్డి - రాజంపేట, జి. శ్రీకాంత్‌రెడ్డి - రాయచోటి, ధర్మాన కృష్ణదాస్‌ - నరసన్నపేట, గొల్ల బాబూరావు - పాయకరావుపేట, తెల్లం బాలరాజు - పోలవరం, మేకతోటి సుచరిత - ప్రత్తిపాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - మాచెర్ల, భూమన కరుణాకరరెడ్డి - తిరుపతి, కొరముట్ల శ్రీనివాసులు - రైల్వే కోడూరు, కాపు రామచంద్రారెడ్డి - రాయదుర్గం, కె. చెన్నకేశవరెడ్డి- ఎమ్మిగనూరు రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా వారు విడివిడిగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో ముందుగా కాంగ్రెస్‌ వైఖరేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తరువాతే సంప్రతింపులు జరపాలని సూచించారు. స్వార్థంతోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చిందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ పార్టీ చెలగాటం ఆడుతోందని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ నిర్ణయం ఏ‌మిటో ప్రకటించలేదని బాలినేని అన్నారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని కాంగ్రెస్‌ పార్టీ సృష్టించిందని బాలినేని విమర్శించారు. ప్రజల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ వికృత రాజకీయ క్రీడ ఆడుతోందని విమర్శించారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ పెద్దల పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారని గుర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ పేరిట కాంగ్రెస్‌ పార్టీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టాలని పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం సరికాదని, ప్రజల హృదయాలతో ఆటలాడుకుంటారా అని ప్రశ్నించారు. ఆటలు కట్టిపెట్టి రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచించాలని కాంగ్రెస్‌ నాయకులకు హితవు పలికారు. ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, ఇది ఆపాలని అన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం రాష్ట్రాన్ని నవ్వులపాలు చేయొద్దని కాంగ్రెస్‌ నాయకులకు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

రాజీనామాలు వారి వ్యక్తిగతం - గట్టు :
వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు వారి వ్యక్తిగత నిర్ణయని ‌పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ముందు తన వైఖరి ప్రకటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ‌వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ డబు‌ల్ గే‌మ్ ఆడుతోందని ఆయన ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top