కిరణ్ రాజీనామాకు వైయస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్ 01 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అరెస్టు ఓ అణిచివేత చర్యని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన విఫలమయ్యారని విమర్శించారు.

శుక్రవారం మధ్యాహ్నం కొణతాల మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఛాంపియన్‌ని అని చెప్పుకుంటున్న కిరణ్ అధికార, పోలీసు యంత్రాంగాలను దుర్వినియోగం చేసి, శ్రీమతి విజయమ్మను అరెస్టు చేయించారనీ, వరద ప్రాంతాలను సందర్శించకుండా ఆమె నిరోధించారనీ మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు తెలంగాణలో తిరగడానికి లేని అభ్యంతరం మా పార్టీ నాయకులకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎందుకీ వివక్ష చూపుతున్నారనీ, రాజకీయ అణచివేతకు ఎందుకు పాల్పడుతున్నారనీ కొణతాల ప్రభుత్వాన్ని నిలదీశారు.

వరద బాధితులు, తీవ్రంగా నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పాల్సిన తరుణంలో శ్రీమతి విజయమ్మ నాలుగురోజుల పర్యటన పెట్టుకున్నారీ, అందులో భాగంగానే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వెళ్ళారీన తెలిపారు. వాఢితులకు ఏకకాలంలో సంఘీభావం తెలపాల్సిన అవసరముందన్నారు.

ఖమ్మం జిల్లా ప్రజలు హృదయపూర్వకంగా ఆమెను ఆహ్వానించారని చెప్పారు. తమ సమస్యలను వివరించారన్నారు. ఇది చూసిన కాంగ్రెస్ పార్టీ నల్గొండలో కూడా శ్రీమతి విజయమ్మకు స్పందన వస్తుందని భయపడిందనీ చెప్పారు. ఆమె అరెస్టుకు ఇంతకు మించి తమకు కారణం ఏమీ కనిపించడంలేదని కొణతాల విశ్లేషించారు. తెలంగాణలో కూడా తమ పార్టీ పట్టు సాధిస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందన్నారు. శ్రీమతి విజయమ్మ అరెస్టు అన్యాయమూ, అనాలోచితమూ, అప్రజాస్వామికమూ అని ఆయన విశ్లేషించారు.

బాధిత ప్రజలను కలుసుకోకుండా శ్రీమతి విజయమ్మను అడ్డుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం కాదా? ఆ ప్రాంతంలో తిరిగే హక్కు తమకు లేదా అని కొణతాల నిలదీశారు.

ప్రభుత్వం వ్యవహరించిన తీరూ, పోలీసు, అధికార యంత్రాంగాన్ని వినియోగించిన వైనం రాష్ట్రం ఇప్పటికే విడిపోయిందనే భావన కలిగిస్తోందని చెప్పారు. శ్రీమతి విజయమ్మ అరెస్టు దానినే సూచిస్తోందన్నారు.

విభజనకు సహకరిస్తున్న కిరణ్, చంద్రబాబు
రాష్ట్ర విభజన ప్రక్రియ సాఫీగా సాగేలా ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహకరిస్తున్నారని కొణతాల ఆరోపించారు. వారు ప్రజలను ఈ విషయంలో మభ్య పెడుతున్నారని మండిపడ్దారు. కిరణ్ సమైక్యవాద ముసుగు వేసుకున్నారనీ, చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా పూర్తిగా సహకరిస్తున్నారనీ వివరించారు. టీడీపీని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ ఢిల్లీలో మరో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోందని ఆరోపించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం మాత్రమే క్యాబినెట్ తెలంగాణ విభజన నోట్ ఆమోదించిన విషయం ఈ సందర్భంగా గమనార్హమని కొణతాల చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు దీక్ష మొదలు పెట్టిన తరవాతనే కేంద్రం విభజనపై మంత్రుల బృందాన్నీ ఏర్పాటు చేసిన విషయమూ అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే చంద్రబాబు గతంలో చేసిన డిమాండ్ మేరకే హోం మంత్రిత్వ శాఖ మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసందన్నారు.

అఖిలపక్ష సమావేశానికి అందిన లేఖ

విభజనకు సంబంధించి పదకొండు అంశాలపై సలహాలు, ప్రతిపాదనలు పంపాల్సిందిగా తమ పార్టీకి లేఖ అందినట్లు కొణతాల ధ్రువీకరించారు. సమైక్యాంధ్రపై తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని ఆయన స్పష్టంచేశారు. లేఖలోని అంశాలను పార్టీలో చర్చించుకున్న తరవాత నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కొణతాల తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top