ప్రతి నీటి బొట్టులో వైయస్‌ఆర్‌ ఉన్నారు

అనంతపురం: జిల్లాలో ప్రజలు  తాగుతున్న ప్రతి  మంచినీటి బొట్టుపై దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు ఉందని, అలాంటి ప్రాంతాన్ని టీడీపీ ప్రభుత్వం బీళ్లుగా మార్చిందని రాప్తాడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేని వ్యక్తి పరిటాల సునీతకు మంత్రి పదవి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాపంపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రసంగించారు. అనంతపురం జిల్లాకు హంద్రీనీవా తీసుకువచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. నాడు 3.45 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు నిర్మించారని, ఇవాళ  ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని స్థితిలో టీడీపీ ఉండటం సిగ్గు సిగ్గు అన్నారు. పరిటాల సునీతమ్మా..మీ ఇంట్లో డబ్బులు ఉంటే మా వద్ద ఉన్నట్లు కాదన్నారు. పెద్ద కాల్వలో నీరు ఉంటే సరిపోదని, పిల్ల కాల్వలకు నీరివ్వాలని కోరారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు ఎక్కడ, జలయజ్ఞంతో నీటిని తెచ్చిన మా తండ్రి లాంటి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎక్కడ అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అనంతపురం పట్టణ సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఉపాధి అవకాశాలే లేవన్నారు. తాగేందుకు గుక్కెడు నీరు లేదన్నారు. పీఏబీఆర్‌ పైప్‌లైన్‌ పక్కనే వెళ్తున్నా చుక్కనీరు ఇవ్వలేని ఈ మంత్రి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారన్నారు. మహిళలకు గార్మెంట్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయాలని, మహానేత పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళ్లకు బొబ్బలెక్కినా పట్టువదలని విక్రమార్కుడు మీ వద్దకు వచ్చారని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ దౌర్జన్యాలు ఇకపై సాగవనీ, పరిటాల సునీత నేతృత్వంలో లూటీలు, అరాచకాలు సాగుతున్నాయని, తన బంధువులను సామంతరాజులుగా పెట్టి బీసీ, ఎస్సీ, మైనారిటీల హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు,  రైతు కూలీలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులోని ప్రతి గడపలో బాధలే ఉన్నాయని, నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వాలని వైయస్‌ జగన్‌ను ప్రకాశ్‌రెడ్డి కోరారు.

తాజా వీడియోలు

Back to Top