<strong>గిరిజనులతో రచ్చబండ కార్యక్రమం</strong><strong>భవిష్యత్ లో ప్రభుత్వం బాక్సైట్ జోళికి వెళ్లకుండా ఉద్యమం</strong><strong>వైఎస్సార్సీపీ బాక్సైట్ వ్యతిరేక కమిటీ తీర్మానం</strong> విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 2న విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈమేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రకటన విడుదల చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి లో జరగనున్న బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారని అమర్ నాథ్ తెలిపారు. అనంతరం లంబసింగిలో గిరిజనులతో రచ్చబండ కార్యక్రమాన్నినిర్వహించి వారితో నేరుగా మాట్లాడతారని వివరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్సార్సీపీ బాక్సైట్ వ్యతిరేక పోరాట కమిటీ తీర్మానం చేసింది. భవిష్యత్తులో ప్రభుత్వం బాక్సైట్ జోళికి రాకుండా పోరాటం తీవ్రతరం చేయాలని కమిటీ తీర్మానించింది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులతో పాటు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లు సభ్యులుగా ఏర్పడిన కమిటీ.. విశాఖలో సమావేశమై బాక్సైట్ ఉద్యమ కార్యచరణపై చర్చించింది. <br/>టీడీపీ ప్రభుత్వం తమ అక్రమ ధనార్జన కోసం బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నం.97 తీసుకొచ్చింది. దీంతో మన్యం భగ్గుమంది. గిరిజనుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆదివాసీలకు అండగా నిలిచి ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. ప్రతిపక్షం ఆందోళనలతో వెనక్కి తగ్గిన సర్కార్.... బాక్సైట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు అండ్ కో ఏ క్షణాన్నైనా మళ్లీ బాక్సైట్ తవ్వకాలు జరిపే అవకాశం ఉండడంతో...జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగానే ఆదివాసీల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ బాక్సైట్ వ్యతిరేక కమిటీ తీర్మానించింది.