బాబు మోసాలను ఎండగట్టడానికే దీక్ష.


పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే వైఎస్ జగనన్న వచ్చే నెల 3, 4వ తేదీల్లో సమర దీక్ష చేపట్టనున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు కేవలం అధికారమే పరమావధిగా వాగ్దానాలు గుప్పించారని విమర్శించారు.


అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ‘ఇంటికో ఉద్యోగమన్నాడు.. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని’ ఆరోపించారు. మ్యానిఫెస్టోలో పొందు పరిచిన ఏ ఒక్క హామీని అమలు పరచలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న ఇలాంటి మోసాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పరచడానికి జగనన్న దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు.

Back to Top