45 ఏళ్లు నిండితే ’వైయ‌స్‌ఆర్‌ చేయూత’ చిత్తూరు : మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే వైయ‌స్‌ఆర్‌ చేయుత' పథకం కింద నెలకు రూ. 2వేల పింఛ‌న్ ఇచ్చి ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే.. 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎద్దన్నవారి పల్లి వద్ద రమణమ్మ(45) అనే దివ్యాంగురాలు కలిశారు. దివ్యాంగులకు అందే పెన్షన్‌ కింద తనకు నెలకు రూ.1500 రావాలని చెప్పారు. అయితే, తనకు కేవలం రూ. 1000 మాత్రమే ప్రతి నెలా అందుతోందని వైయ‌స్‌ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని తెలుగుదేశం పార్టీ నేతలను అడిగితే.. బెదిరిస్తున్నారని చెప్పారు. రమణమ్మతో మాట్లాడిన వైయ‌స్‌ జగన్‌ ఆమెను ఓదార్చారు. రమణమ్మకు జరిగిన అన్యాయం పట్ల పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ’వైయ‌స్‌ఆర్‌ చేయూత’  పథకం కింద వెనుకబడిన వర్గాలకు చెంది 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్‌ అందజేస్తామని చెప్పారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా చెల్లిస్తామని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. రూ. వెయ్యి కంటే ఎక్కువగా వచ్చే వైద్య బిల్లులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ఆయ‌న మాట ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Back to Top