స్పీక‌ర్‌కు వైయస్ జగన్ బహిరంగ లేఖ

బాబు ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
మా పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను కొని మరో దొంగతనం చేశారు
దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయంలోకి ప్రవేశిస్తారా
సభకు మకిలీ అంటకుండా చూడడం స్పీకర్ బాధ్యత
ఆ 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి
లేఖలో వైయస్ జగన్ డిమాండ్

హైదరాబాద్ః విజయవాడలో నూతన అసెంబ్లీ తాత్కాలిక భవనాలు ప్రారంభం మరియు మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ లు లేఖను విడుదల చేశారు. వైయస్ జగన్ లేఖ సారాంశం....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి..

దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రవేశిస్తారా?
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీకి వెళ్లబోతున్న సమయంలో, ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఇందుకు దారి తీసిన పరిస్థితులను మీకు గుర్తు చేస్తున్నాను.  ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోవడం వల్లే హైదరాబాద్‌ నుంచి అమరావతికి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. 

తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా?
హైదరాబాద్ అసెంబ్లీలో ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ కండువాలు కప్పడం. ఇందు కోసం వందల కోట్లు వెచ్చించటం.

ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగ ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రకటించండి అని ఏనాడో అడిగినా ఇంత వరకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం కానీ, వారిని సభలోకి అనుమతించడం గానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.

ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్‌ అసెంబ్లీని ఖాళీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య బద్ధంగా స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణమే మీరు నిర్వర్తించి పార్టీ మారిన 21 మంది వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులను అనర్హులుగా ప్రకటించి కొత్త రాజధానిలో, కొత్త సభకు మకిలి అంటకుండా చూడాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం.. మీరు ఎంత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా రాజ్యాంగానికి, ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం... అభినందనలతో మీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి Back to Top