చంద్రబాబు జీవితమంతా మోసాలే

లక్షల గొంతులు బాక్సైట్ ను వ్యతిరేకిస్తున్నాయి
చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదు
చంద్రబాబుకు గట్టిగా బుద్దిచెబుతాం

చింతపల్లిః ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షల గొంతులు బాక్సైట్ ను వ్యతిరేకిస్తున్నా చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటానని  గవర్నర్ కు లేఖ కూడా రాసిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక అదే బాక్సైట్ గనులకు అనుమతినిస్తూ జీవో 97 జారీ చేయడం దారుణమన్నారు. మన్యం భగ్గుమనడంతో జీవో తనకు తెలియదంటే మాట్లాడుతున్నాడని...చంద్రబాబు జీవితమంతా మోసం, అబద్ధాలు, వెన్నుపోటులేనని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. 

బాక్సైట్ తవ్వకాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి ప్రయత్నం చేసి వెనకడుగు వేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయి  ప్రతిపక్షంలో కూర్చునే సరికి బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని చెప్పారు. గ్రామసభలు జరగలేదని, అవి ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్లేటు ఫిరాయించారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు. ఇంతకుముందు సర్పంచిగా ఉన్న వెంకటరమణ గ్రామసభలో తీర్మానం చేశారా అంటే లేదని ప్రజలంతా చెబుతున్నారు. అప్పటి టీడీపీ సర్పంచి ప్రస్తుత సర్పంచి తీర్మానం చేయలేదని చెబుతున్నా చంద్రబాబు తీర్మానం జరిగిపోయిందంటున్నాడు. అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసగించే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని తానింతవరకు చూడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును వైఎస్ జగన్ సభాముఖంగా నిలదీశారు.  రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియామకం రాజ్యాంగ హక్కు. అందులో మూడొంతుల మంది గిరిజన శాసన సభ్యులు అయి ఉండాలని చెబుతున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో అంతా వైఎస్సార్సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌ను వ్యతిరేకిస్తారని  చంద్రబాబు గిరిజన సలహా కమిటీ నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారని వైఎస్ జగన్ తూర్పారబట్టారు. చంద్రబాబు మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి తెచ్చి, గిరిజన సలహా కమిటీ వేయించి, అందులో గట్టిగా వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. 

బాక్సైట్ గనులు ఇచ్చే క్రమంలో చంద్రబాబు గిరిజన సలహా కమిటీచేత అడ్డగోలు నిర్ణయాలు తీయించే కార్యక్రమాలు చేయించాడని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు.  బాక్సైట్ గనులు ఏమైనా చేయాల్సి వస్తే గిరిజనులు లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయాలి. కానీ అప్పట్లో, 24.5.200న చంద్రబాబు.. బలవంతంగా గిరిజన సలహా కమిటీ నియమించి తన ఎమ్మెల్యేలతో బలవంతంగా రుద్దించే ప్రయత్నం చేశాడు. అందులోఎవరైనా తవ్వుకోవచ్చని దుబాయ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబు తీర్మానం చేయించాడు. ఈవాళ అదే చంద్రబాబు ఆరోజు అంతటి గట్టి ప్రయత్నాలు చేసి, మైనింగ్ చట్టాలను కూడా మార్చాలని కేంద్రంమీద ఒత్తిడి తెచ్చారు. గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని కేంద్రం చెప్పడంతో వెనక్కి తగ్గారన్నారు. 

చంద్రబాబు ఏం చేశారో, రాజశేఖరరెడ్డి ఏం చేశారో... తర్వాతి సీఎంలు ఏం చేశారో, అధికారంలోకి మళ్లీ వచ్చాక చంద్రబాబు ఏం చేశారో ప్రజలకంతా తెలుసనని వైఎస్ జగన్ అన్నారు. రాజశేఖరరెడ్డి చనిపోయి ఆరేళ్లవుతున్నా..చంద్రబాబు కొత్తగా బాక్సైట్ తవ్వకాలకు జీవో విడుదల చేస్తూ మహానేత మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి,  జగన్ మోహన్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ల గుండెల్లో స్థానం ఉంటుందన్నారు.
Back to Top