‘సంక్షోభంలో సైతం అవకాశాలు వెతుక్కోవడం’ అంటే ఇదేనా బాబూ?

 
04–12–2018, మంగళవారం,

సంతవురిటి, శ్రీకాకుళం జిల్లా.

‘తన కోసం తపించేవాడు.. సామాన్యుడు. పరుల కోసం జీవించేవాడు.. మహనీయుడు’ అన్నారు.. పెద్దలు. నిరంతరం ప్రజల కోసం పడ్డ తపనే నాన్నగారిని కోట్లాది మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. కొండంపేటకు చెందిన జ్యోతిర్మయి, రేష్మ, రూప తదితర చెల్లెమ్మలు కలిశారు. నాన్నగారి జ్ఞాపకార్థం ఆ గ్రామస్తులు ఏటా వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతుంటే చాలా సంతోషమేసింది.  

అవధులు లేని అభిమానం భక్తిగానూ మారింది. దేవుడిలా వరాలిచ్చిన నాన్నగారికి గుడి కట్టుకున్నామన్నారు.. కోదులగుమ్మడ గ్రామ స్తులు. ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘాల విరాళాలతో, శ్రమదానంతో ఆలయం వెలసిందట. పదిమందికి మంచి చేసి వారి గుండెల్లో స్థానం పొందడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది?  


పేదరికమే పెద్ద శాపం. ఆ పై పెద్ద జబ్బు చేస్తే.. ఏలినవారి నుంచి ఏ సాయం అందకపోతే.. ఆ అభాగ్యుల జీవితాలు ఎంతలా విలవిల్లాడిపోతాయో! పొగిరి గ్రామానికి చెందిన గౌరునాయుడు అనే సోదరుడు 18 ఏళ్ల క్రితమే పదో తరగతిలో 80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుని పాఠశాలలో ప్రథముడిగా నిలిచాడట. కానీ పై చదువులు చదివే స్తోమత లేక పెయింటింగ్‌ పనులు, కూలి పనుల్లోనే జీవనోపాధి వెతుక్కున్నాడు. ఇప్పుడు అతని బిడ్డకు తలసీమియా జబ్బట. నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాలి.. మందులూ కొనాలి. వాటికే రూ.3 వేల వరకు ఖర్చవుతోందట. ‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులో.. ఈ కష్టం తలకు మించిన భారమైంది.. కనీసం రక్తమైనా ఉచితంగా అందిస్తే బాగుండేది’ అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు.  

అదే పొగిరి గ్రామానికి చెందిన మరో సోదరి.. హెచ్‌ఐవీ బాధితురాలు. ఆ జబ్బుతోనే భర్త చనిపోయాడట. తనకు న్యాయంగా రావాల్సిన పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా వంకలు పెట్టి ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకన్నా దయనీయ స్థితి ఉంటుందా?  

జగన్నాథపురానికి చెందిన షిరిడి సాయి, నటరాజు, శివశక్తి డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలు కలిశారు. అందరూ దళిత మహిళలే. కూలినాలి చేసుకుంటూ సక్రమంగా రుణం తీర్చుకుంటున్నవారే. బాబుగారి రుణమాఫీ మాటలు నమ్మి కట్టడం ఆపేశారట. వడ్డీల మీద వడ్డీలు పడి అప్పు తడిసి మోపెడైంది. బ్యాంకువాళ్లు నోటీసులు ఇచ్చారట. దాచుకున్న పొదుపు డబ్బంతా వడ్డీలకే జమ అయిపోయిందట. అప్పుగా ఇచ్చిన పసుపు, కుంకుమల డబ్బు వడ్డీ భారాన్ని ఇంకాస్త పెంచింది. సాఫీగా బతుకుతున్న మమ్మల్ని మోసం చేసి, వేధింపులకు గురిచేసిన బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆవేదనలో అర్థం ఉంది. అవమానాలపాలు చేసిన బాబుగారిది ద్రోహం కాక మరేమిటి? 

సాయంత్రం పాలఖండ్యాంకు చెందిన రమణారావు అనే కౌలు రైతు కలిశాడు. హుద్‌హుద్‌ తుపానప్పుడు పంట మొత్తం కోల్పోయాడట. నష్టపరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన లిస్టులో తన పేరు ఉండటం చూసి సంబరపడ్డాడు. ఏళ్లు గడిచినా ఒక్క పైసా జమైంది లేదు. అధికారుల చుట్టూ, కలెక్టర్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. దానికైన ఖర్చే పరిహారం కన్నా ఎక్కువైందని వాపోయాడు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తుపానులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలలో సైతం ఏ సహాయం అందించకపోయినా.. ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడము, రాజకీయ స్వార్థం చూసుకోవడము, నిధులు దోచుకోవడము ధర్మమేనా? మీరు తరచూ చెప్పే.. ‘సంక్షోభంలో సైతం అవ కాశాలు వెతుక్కోవడం’ అంటే ఇదేనా?  
- వైఎస్‌ జగన్‌


తాజా వీడియోలు

Back to Top