మీ పాపాల్ని అధికారులపై నెట్టేయడం న్యాయమా బాబూ?

 

 
27–11–2018, మంగళవారం,

 అట్టలి, శ్రీకాకుళం జిల్లా. 

విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేటకు చెందిన శ్రావణ సంధ్య, ప్రసాద్‌ దంపతులు తమ మూడు నెలల బిడ్డతో వచ్చి కలిశారు. ఆ చిన్నారికి పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన జబ్బు. వెంటనే వైద్యమందకపోతే ప్రాణహాని ఉందని వైద్యులు చెప్పారట. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారట. ఆరోగ్యశ్రీ వర్తించలేదట. చేయించుకునే స్తోమత లేదు. చూస్తూ చూస్తూ కన్నబిడ్డను వదులుకోలేరు. వారి కష్టం కదిలించింది. వైద్యసాయం పొందిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గానికి వచ్చి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. మనసుకు చాలా సంతోషమనిపించింది.  

మధ్యాహ్నం శిబిరం దగ్గర కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. 86 ఏళ్ల పింగళి విఠలేశ్వరరావు అనే పెద్దాయన వచ్చి కలిశారు. ఆయనకు 2007లో గుండెజబ్బు వచ్చిందట. ఆపరేషన్‌ చేయించుకునే స్తోమత లేదు. ఆ సమయంలో నాన్నగారి చలవతో కార్పొరేట్‌ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ ఉచితంగా జరిగిందని, ఛార్జీలు, మందుల భారం కూడా మీద పడనీయలేదని నాన్నగారిని పదేపదే గుర్తు చేసుకున్నారు. ఆ పెద్దాయన వీఏవోగా పనిచేసి రిటైర్‌ అయ్యారట. ఈరోజు తనకు వస్తున్న పెన్షన్‌ కూడా నాన్నగారి పుణ్యమేనని చెప్పారు. నన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు. ఇలాంటి అనుభవాలే జీవితంలో అంతులేని తృప్తినిస్తాయి.  


తన మనవరాళ్లిద్దరికీ బాలికా సంరక్షణ పథకం కింద ఇచ్చిన బాండ్లు ఇప్పుడు పనికి రావంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. శీరాపు సత్యం అనే పెద్దాయన. తన బిడ్డకు బంగారు తల్లి పథకం కింద డబ్బు జమ అవ్వడం లేదని పాపంపేటకు చెందిన ధనలక్ష్మి వాపోయింది. బాలికల సంరక్షణ కోసం ఉద్దేశించిన ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఈ పాలనలో లేకపోవడం దారుణమైన విషయం. చట్టబద్ధమైన పాత పథకాలను సైతం తీసివేసి.. కొత్త పథకాలేవీ వర్తింపజేయకపోవడం ద్రోహం కాక మరేమిటి?  

ఈ రోజు మధ్యాహ్నం శిబిరానికి 13 జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీలు కలిశారు. పాదయాత్ర విజయవంతం కావాలని, నేను క్షేమంగా ఉండాలని కోరుతూ దువా చేశారు. మక్కా నుంచి తెచ్చిన పవిత్ర ‘ఆబే జంజం’జలాలను తాగించారు. నా పట్ల, నా కుటుంబం పట్ల ఆ సోదరులు చూపిన ప్రేమ మరువలేనిది.  

వండవ గ్రామంలో తమలపాకు రైతులు కలిశారు. ఆ పంటను దేవతల పంట అంటారట. ఎంతో నిష్టతో సాగు చేస్తారట. కానీ ఆ దేవతల పంట గిట్టుబాటు ధరకు మాత్రం దేవుడే దిక్కని వాపోయే పరిస్థితి ఎదురైందని ఆవేదన చెందారు.  

చెరువులు, కొండలే కాదు.. ఆఖరుకు ప్రభుత్వ పాఠశాలలు కూడా కబ్జాకు గురవుతుండటం బాధాకరం. ఎనిమిదో తరగతి చదువుతున్న తెట్టంగి పాఠశాల విద్యార్థినులు కలిశారు. తమ పాఠశాలకు చెందిన ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వాపోయారు. ఆట స్థలమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 11న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఈ తెట్టంగి నుంచే ప్రారంభించారట బాబుగారు. పాఠశాలను కబ్జాకోరల నుంచి వెలికితీస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారట. అంతేకాకుండా తెట్టంగిని ఆదర్శ గ్రామంగా ప్రకటించి ఇంటింటికీ కుళాయిలు, రోడ్లు, ఆస్పత్రి, ఇళ్లు, డ్రైనేజీలు అంటూ అర చేతిలో స్వర్గం చూపారట. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు చెబుతుంటే పెద్దగా ఆశ్చర్యమనిపించలేదు. ఎందుకంటే అది బాబుగారి సహజ లక్షణమే కదా. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి, అన్నీ చేసేశాను.. అండగా ఉండండి అని ప్రజలను కోరడం విడ్డూరం కాదా? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అధికారులు చేసే తప్పులతో.. ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకోవద్దు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు అండగా ఉండండి అని ప్రజలను కోరుతున్నారు. పాపాలన్నీ మీరు చేసి నెపాన్ని అధికారులపై నెట్టివేయడం న్యాయమేనా? గొప్పలు మీవి.. తప్పులు అధికారులు, ప్రజలవా?  
-వైఎస్‌ జగన్‌        


Back to Top