నిజంగా మంచి చేసి ఉంటే.. అంత భయమెందుకు బాబూ?

304వ రోజు పాదయాత్ర డైరీ
 

 24–11–2018, శనివారం 
తురకనాయుడువలస, విజయనగరం జిల్లా

ఈ రోజు పాదయాత్రలో గ్రామగ్రామానా నాన్నగారిని స్మరించుకున్నారు. ఆయన లేని లోటును గుర్తుచేసుకున్నారు. దారిపొడవునా పచ్చటి పొలాలు కనిపించాయి. ఆ పచ్చదనం.. నాన్నగారి తోటపల్లి ప్రాజెక్టు పుణ్యమేనన్నారు. ఈ ప్రాంత బీడు భూముల దాహార్తి తీర్చిన దార్శనికత నాన్నగారిదని చెప్పారు.  

సంక్షేమ పథకాలు అందడం లేదని దాదాపు ప్రతి గ్రామంలోనూ గోడు వెళ్లబుచ్చారు. బీజేపురంలో మండగి కుమారికి చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఏ ఆధారమూ లేని ఆ సోదరికి ఇల్లు ఇవ్వలేదు.. వితంతు పింఛనూ రావడం లేదు. గంగంపేటకు చెందిన రామమ్మకు 13 ఏళ్లుగా వితంతు పింఛన్‌ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక.. అంగన్‌వాడీలో హెల్పర్‌గా పనిచేస్తోందని పింఛన్‌ తీసేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకే వయోపరిమితి పేరిట ఉద్యోగమూ పోయింది. ఇప్పుడామెకు పింఛన్‌ రాదు.. ఉద్యోగమూ లేదు. ఐదుగురు బిడ్డల్ని ఎలా సాకాలని ఆ తల్లి గోడు వెళ్లబోసుకుంది. శిఖరం గ్రామంలో పన్నమ్మ అనే 85 ఏళ్ల అవ్వకు, మానసిక దివ్యాంగురాలు అరుణకుమారికి, పుట్టు మూగవాడైన వెంకటరమణకు పింఛన్లు ఇవ్వడం లేదు. మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వడం లేదని చినకుదమ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎక్కడ చూసినా ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. ముఖ్యమంత్రిగారు మాత్రం సంక్షేమ పథకాలన్నీ సంతృప్త స్థాయిలో అమలుచేశానని.. నిన్న జరిగిన అనంతపురం సభలో చెప్పారు. అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుంది ఆయన వ్యవహార శైలి.
 
తన కుమారుడు గణేశ్‌.. బీఈడీ చేసి ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ లేక నిరుద్యోగిగానే మిగిలాడని బొద్దాన గౌరమ్మ వాపోయింది. తురకనాయుడువలసలో ఆవణ్య అనే దళిత సోదరి డీఈడీ పూర్తిచేసి ఆరేళ్లయింది. డీఎస్సీపై కొండంత ఆశలు పెట్టుకుంది. ఇప్పుడేమో ఎన్నికల తాయిలంగా ప్రకటించిన డీఎస్సీలో పోస్టులను కుదించేసి.. మినీ డీఎస్సీగా మార్చేసి మోసం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. పరీక్షకు నెల రోజుల ముందు సిలబస్‌ పెంచేస్తే ఎలా.. అని బావురుమంది.
 
అన్ని గ్రామాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులు కలుస్తూనే ఉన్నారు. శిఖబడి గ్రామంలో దాసరి శివకుమార్, సంతోష్‌కుమారి అనే అన్నాచెల్లెళ్లు చిన్నప్పుడే అమ్మానాన్నను కోల్పోయారు. ఆ చెల్లెమ్మ పెళ్లికి ఉపయోగపడతాయని ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి అగ్రిగోల్డ్‌లో కట్టారట. ఇప్పుడా అనాథ బిడ్డల బతుకులు ఏం కావాలని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తురకనాయుడువలసలో 400 ఇళ్లుంటే.. 300కి పైగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్లు ఉన్నాయట. ఆ చిన్నగ్రామంలోనే రూ.రెండున్నర కోట్లకు పైగా డిపాజిట్లు కట్టారట. ఆ గ్రామంలో చాలామంది బాధితులు కలిశారు. హాయ్‌ల్యాండ్‌ను మింగేయాలని బాబుగారు ప్రయత్నిస్తుండటం.. తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ఊళ్లో కొర్రాడ ఈశ్వరరావు అనే బాధితుడు 45 ఏళ్ల వయసులోనే తీవ్ర మానసిక వేదనకు గురై గుండెపోటుతో చనిపోయాడట. నిన్న వినుకొండలో ధనరాజ్‌బాలాజీ అనే ఏజెంటు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం, శ్రీకాకుళం జిల్లా నందిగామ్‌లో 44 ఏళ్లకే వసంతరావు అనే సోదరుడు గుండె ఆగి మరణించడం కలచివేశాయి. పరిస్థితులిలా ఉంటే.. అనంతపురంలో మరో బాధితుడు సిద్ధేశ్వర్‌.. అక్కడికెళ్లిన ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకుంటే, ఆయనగారేమో ఆ బాధితుడితో వెటకారంగా మాట్లాడటం, మండిపడి చెయ్యెత్తడం అమానుషం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి వేశాను. అండంగా ఉండండి నాకు ధైర్యంగా ఉంటుంది’ అని బతిమాలుకుంటున్నారు.. నిజంగా ప్రజలందరికీ మంచిచేసి ఉంటే.. కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చి ఉండేదా? మీకు రక్షణ వలయంగా ఉండి రక్షించాలని ప్రజల్ని కోరారు.. పాపాలన్నీ మీరు చేసి.. ‘కాపాడండి..’ అంటూ ప్రజల్ని వేడుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా?  
-వైఎస్‌ జగన్‌    


Back to Top