ఏ ప్రాజెక్టయినా, పథకమైనా పాలకులకు కాసులు కురిపించేందుకే పరిమితమవడం శోచనీయం

 

 
19–11–2018, సోమవారం  
సీమనాయుడువలస, విజయనగరం జిల్లా

రాత్రి బసచేసిన తోటపల్లి ప్రాజెక్టు శిబిరం నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించాను. పునరావాసం కల్పించకుండా మాయమాటలు చెబుతోందీ ప్రభుత్వం అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు నందివానివలస గ్రామస్తులు. నాన్నగారి హయాంలోనే దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టుకు మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తిచేయకుండానే హడావుడిగా ప్రారంభోత్సవం చేసి ప్రచారం చేసుకోవడంలో ఉన్న తపన.. బాధితులకు పునరావాసం కల్పించడంలో లేకపోవడం దారుణమనిపించింది.  

ఈ రోజు పాదయాత్రలో పలుచోట్ల.. తిత్లీ తుపానుకు పూర్తిగా దెబ్బతిన్న అరటితోటలు కనిపించాయి. గిజబ దగ్గర అలా నేలమట్టమైన ఓ అరటితోట వద్దకు వెళ్లి చూశాను. పంటకు అయ్యే ఖర్చులో మూడోవంతు కూడా పరిహారం ఇవ్వలేదని బాధపడ్డారు అక్కడి రైతన్నలు. సంవత్సరాల తరబడి హుద్‌హుద్‌ తుపాను పరిహారాన్నే ఇవ్వని నేతలు.. మీరు ఈ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి హడావుడిగా తిత్లీ తుపాను పరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. ఇచ్చిన ఆ అరకొర పరిహారమైనా.. పాదయాత్ర పుణ్యమేనన్నారు. ప్రచారం, రాజకీయ ప్రయోజనాలు, సమీపంలో ఎన్నికలుంటే తప్ప బాధితులను ఆదుకోవాలనే తపన ఈ సర్కారుకు లేకపోవడమన్నది విచారకరం.  

తోటపల్లి ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన గ్రామాలకు మాత్రం ఆ ప్రాజెక్టు నీరు అందడం లేదని గిజబ గ్రామం వద్ద రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసంగి వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేస్తే.. 16 పంచాయతీలకు నీరందేది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన కూడా చేయడంలేదంటూ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. మరి ఇది రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం హాస్యాస్పదం కాదా? 

దారిలో తులసివలస గ్రామ గిరిజనులు కలిశారు. పాలకుల నిర్లక్ష్యం, అవినీతి, వివక్ష.. వెరసి నాగావళిపై పూర్ణపాడు–లాబేసు వంతెన పథకం నత్తనడకన సాగుతోందని చెప్పారు. ఆ వంతెన పూర్తికాకపోవడంతో కేవలం ఐదు కిలో మీటర్ల దూరం ఉండే మండల కేంద్రానికి వెళ్లడానికి.. 50 కిలోమీటర్లకు పైగా చుట్టుకుని వెళ్లాల్సి వస్తోందన్నారు. నదిలో నాటుపడవ ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించిందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి వెళ్లాలన్నా, ఒడిశాకు రాకపోకలు సాగించాలన్నా ఈ వంతెన అత్యంత సౌకర్యవంతమని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా నిధులు ఆవిరవుతున్నాయే తప్ప పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఏ ప్రాజెక్టయినా, పథకం అయినా.. పాలక నేతలకు కాసుల వర్షం కురిపించడానికే పరిమితమవడం శోచనీయం.   

వెనుకబడిన కులాలు, చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉండే ఈ కరువు జిల్లాలోనే ఉచిత విద్యుత్‌ అటకెక్కితే.. మిగతా ప్రాంతాల్లో ఎలా ఆశించగలం! వెంకటరాజపురానికి చెందిన ఎకరా పొలం ఉన్న కన్నమనాయుడుకు.. రామానాయుడువలసకు చెందిన రెండెకరాల రాజ్యలక్ష్మికి.. వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయట. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లేదా అన్నా.. అంటూ అమాయకంగా అడుగుతూ ఆ బిల్లులను చూపించారు. నాన్నగారి హయాంలో ఒక్క వ్యవసాయ మోటారుకైనా రూపాయి బిల్లయినా వచ్చిందా? మనసుంటే మార్గం ఉంటుంది.. మనసులోనే మోసం చేయాలనుంటే ఫలితం ఇలానే ఉంటుంది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి.. నానాసాకులతో తూట్లు పొడవడం న్యాయమేనా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. పరిశ్రమలకు, ఆక్వా రంగానికి విద్యుత్‌ రాయితీలంటూ ఓ వైపు ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు పలు రకాల అదనపు చార్జీల పేరుతో.. రకరకాల సాకులతో.. నడ్డివిరిచి దొడ్డి దారిన అధిక డబ్బు వసూలు చేయడం ధర్మమేనా?  
-వైఎస్‌ జగన్‌   


Back to Top