అన్యాయానికి గురైన వారిని కోర్టుకీడుస్తామనడమేమిటి బాబూ?

 

13–11–2018, మంగళవారం 
తామరఖండి, విజయనగరం జిల్లా 

ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసుకొని పార్వతీపురంలో అడుగుపెట్టాను. ఏ నియోజకవర్గంలో చూసినా అభివృద్ధి కాసింతైనా కనిపించకపోగా.. వివక్షకు మాత్రం కొదువే లేదనిపించింది. తూరుమామిడి గ్రామస్తులు వచ్చి నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఊళ్లో 97 మందికి పింఛన్లు తీసేశారట. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి మరీ పింఛన్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని వారు చెబుతుంటే చాలా బాధనిపించింది. అన్ని అర్హతలున్నా సంక్షేమ ఫలాల కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడమేమిటి? ప్రభుత్వమే తమను వేధిస్తుందంటూ పేదలు కోర్టుకెక్కడం పాలకులకు సిగ్గుచేటు కాదా? నాన్నగారి హయాంలో పింఛన్లు ఆపేశారని, ఇళ్లు ఇవ్వడం లేదని, రేషన్‌ రావడం లేదని.. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదైనా ఉండేదా?  

అదే గ్రామానికి చెందిన పోలమాంబ డ్వాక్రా గ్రూప్‌ అక్కచెల్లమ్మలదీ అదే ఆవేదన. బాబు గారి రుణమాఫీ మాటలు నమ్మి మోసపోయామన్నారు. వడ్డీల మీద వడ్డీలతో అప్పు కాస్త తడిసి మోపెడైందని వాపోయారు. కట్టకపోతే కోర్టుకీడుస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందని బావురుమన్నారు. అన్యాయానికి గురైన వారిని కోర్టుకు ఈడుస్తామనడమేమిటి? మోసపోయిన వారికా శిక్ష? 

వెంకటభైరిపురం ఒక్క గ్రామంలోనే తొమ్మిది మంది హిందీ పండిట్లు ఉన్నారట. వారంతా నాలుగేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వారే. టెట్ల కోసం, డీఎస్సీల కోసం కోచింగ్‌ల పేరిట రూ.వేలకు వేలు ఖర్చు చేసుకున్నవారే. నాలుగేళ్లుగా ఊరించిన డీఎస్సీ తీరా అరకొర పోస్టులతో ఉసూరుమనిపించిందని వారంతా నిరాశ వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న బాబు గారు నాలుగున్నరేళ్లు పట్టించుకోకపోగా.. తీరా ఎన్నికల ముందు కంటితుడుపుగా డీఎస్సీ నిర్వహిస్తుండటం, కేవలం కొద్దిపాటి ఖాళీలకే నోటిఫికేషన్లు ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

సువర్ణముఖి మీద వంతెన లేకపోవడంతో 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు డి.సిర్లాం గ్రామస్తులు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లాలన్నా.. పిల్లల చదువులకైనా కష్టంగా ఉందని వాపోయారు. బగ్గందొర వలస, గెడ్డలుప్పి గ్రామస్తులదీ ఇదే ఆవేదన. అధికారంలోకి రాగానే గెడ్డలుప్పి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గారు.. తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా అక్కడ ఏ మాత్రం పురోగతి లేకుండా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా నేను పాదయాత్రగా వస్తున్నానని తెలిసి హడావుడిగా జేసీబీ తెచ్చి పనులు చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని వారు వాపోయారు. సాయంత్రం ఆ నది వద్దకు నన్ను తీసుకెళ్లి మరీ ఆ తతంగాన్ని చూపించారు.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఖాళీలుండగా.. అందులో మూడో వంతు పోస్టులకు కూడా డీఎస్సీ నిర్వహించకపోవడం అన్యాయం కాదా? ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి మీ బినామీ ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే కాదా?  
-వైఎస్‌ జగన్‌  


Back to Top