యాదవ సోదరులు, గీత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా బాబూ?

29–09–2018, శనివారం 
పాత భీమసింగి, విజయనగరం జిల్లా

ఈ రోజంతా జామి మండలంలోనే పాదయాత్ర సాగింది. ఒకే మండలం రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఎస్‌.కోటలో సగం, గజపతినగరంలో సగం పంచాయతీలున్నాయి. ఇక్కడి అనేక గ్రామాల చరిత్ర.. మహాభారత ఘట్టాలతో ముడిపడి ఉంది. ఉదయం నడిచిన గ్రామాల్లో అత్యధికంగా యాదవ సోదరులే ఉన్నారు. వారంతా తమ కష్టనష్టాలు చెప్పుకొన్నారు. ఈ కాలంలో కులవృత్తి కష్టమైపోయిందన్నారు. గతంలోలా గొర్రెలకు, పెంపకందార్లకు బీమా సౌకర్యం లేదని.. వైద్యం, మందులు అందడం లేదని.. రుణాలసలే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆలమండ గ్రామం పశువుల సంతకు మహాప్రసిద్ధి. మహాభారతంలో విరాటరాజు వద్ద విశేష సంఖ్యలో పశు సంపద ఉండేదట. అలనాటి ఆ ఆలమందల వల్లనే ఈ గ్రామానికి ఆలమండ అని పేరొచ్చిందని చెబుతుంటారు. అటువంటి ఆలమండ.. నేడు పశువిక్రయాలకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. వ్యవసాయం భారమై.. పశుగ్రాసం కరువై.. పాలకు గిట్టుబాటు ధరలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పశువులు కబేళాలకు తరలిపోతుండటం కలచివేసింది.  

గొడికొమ్ము గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాజేశ్వరి అనే చెల్లెమ్మ కలిసింది. ఏళ్ల కిందటే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోతే.. అమ్మ కూలికెళ్లి బిడ్డలను సాకుతోంది. ఆ చెల్లెమ్మకేమో ఒక కన్ను పూర్తిగా కనిపించదు.. మరో కన్నూ మసక మసకగా కనిపిస్తుంది. ఆ కంటికి ఆపరేషన్‌ చేయించుకుందామంటే.. వేలకు వేలు ఖర్చుచేయలేని దుస్థితి. ఆరోగ్యశ్రీ వర్తించని దయనీయ పరిస్థితి. అయినా సరే.. జీవన పోరాటంలో పట్టుదలే ఆయుధమనుకుంది. చదువుతో పాటు వెయిట్‌ లిఫ్టింగ్, షాట్‌పుట్‌లలో ప్రతిభ కనబరిచి మెమోంటోలు గెలిచింది. అంతే పట్టుదలగా డైట్‌ కోర్సు పూర్తి చేసింది. డీఎస్సీ వస్తే ఉద్యోగం తెచ్చుకుని.. వచ్చే డబ్బుతో కంటికి ఆపరేషన్‌ చేయించుకోవాలని ఆశపడింది. కానీ ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ రాకపోయే. ఉద్యోగమూ లేకపోయే. ఆపరేషనూ కాకపోయే. మరి వైకల్యమెవరికి? తండ్రి ఆదరణ లేకపోయినా.. పేదరికం పట్టి పీడిస్తున్నా.. రెండు కళ్లూ కనిపించకపోయినా.. అంతులేని ఆత్మవిశ్వాసంతో బతుకు పోరాటం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ చెల్లెమ్మకా? ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. మాట తప్పి లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసగించిన సర్కారుకా?  

 ఉదయం కలిసిన మామిడి తాండ్ర తయారీదారుల కష్టాలు వింటుంటే.. చాలా బాధనిపించింది. నాన్నగారి హయాంలో పన్నులు తగ్గించి, పంచదారను సబ్సిడీకి సరఫరా చేసి వారిని ఆదుకున్నారు. ఈ పాలనలో ఏ సబ్సిడీలూ లేకపోగా.. పన్నుల బాదుడు పెరిగిపోయింది. ప్రభుత్వ నిరాదరణ ఇలాగే కొనసాగితే ప్రసిద్ధిగాంచిన భీమాళి మామిడి తాండ్ర.. గత చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఎంతో దూరం లేదనిపించింది.  

 సాయంత్రం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు కలిశారు. అన్ని నిబంధనలనూ పాటిస్తూ ఉద్యోగాల్లో చేరిన తమను.. తప్పక క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి దగా చేశారని వాపోయారు. తమను కన్సాలిడేటెడ్‌ వేతనాల జాబితాలో చేర్చడంతో క్రమబద్ధీకరణ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు.. ప్రయివేటు సేవలే ముద్దు’ అని మనసులో మాటగా రాసుకున్న వ్యక్తి న్యాయం చేస్తారనుకోవడం భ్రమే. 

యాతపాలెం, కొత్త భీమసింగి గ్రామాల్లో గీత కార్మికులు అధికంగా ఉన్నారు. హుద్‌ హుద్‌ తుపానుతో జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్న తమకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. తుపాను చేసిన నష్టం కన్నా.. సర్కారు చేసిన మోసమే ఎక్కువగా కుంగదీస్తోందన్నారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి గొర్రెలకు బీమా.. గొర్రెల కాపరులకు రూ.2 లక్షల ఉచిత బీమా.. గొర్రెల మేత కోసం భూముల కేటాయింపు.. గీత కార్మికుల కోసం బెల్టు షాపుల రద్దు.. చెట్టు పన్నును ప్రభుత్వం చెల్లించడం.. తాటిచెట్ల పెంపకం కోసం భూముల కేటాయింపు.. ఇవన్నీ ఎక్కడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? ఇవి మీ మేనిఫెస్టోలోని 22వ పేజీలోని అంశాలే. యాదవ సోదరులు, గీత కార్మికుల కోసం మేనిఫెస్టోలో మీరిచ్చిన 14 హామీలలో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? 
-వైఎస్‌ జగన్‌ 


Back to Top