బీసీలకు చిన్నచిన్న తాయిలాలిచ్చి అదే అభివృద్ధి అని మభ్యపెట్టడం ధర్మమేనా?


 
08–05–2018, మంగళవారం   
ముదినేపల్లి, కృష్ణా జిల్లా 

కైకలూరు నియోజకవర్గంలో అడుగులు పడగానే.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న మంచినీటి సరస్సులలో ఒకటై, ఒకప్పుడు ప్రకృతి వైభవానికి చిహ్నమైన కొల్లేటి సరస్సు, సైబీరియా నుంచి తరలివచ్చే ఫెలికాన్‌ పక్షులతో సందడిగా ఉండే ఆటపాక పక్షుల కేంద్రం గుర్తొచ్చాయి. కానీ నేటి ఆ కొల్లేటి సరస్సు దుర్గతి, దాని చుట్టూ అల్లుకున్న మత్స్యకార కుటుంబాల దుస్థితి గురించి చెబుతుంటే విని మనసుకు చాలా బాధేసింది.  
 
కల్వపూడి సత్రం వద్ద నాయీ బ్రాహ్మణ సోదరులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇప్పటికీ క్షౌర వృత్తి అంటే చులకన భావం.. క్షురకులంటే చిన్నచూపు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ‘అన్నా.. జనాభా ప్రాతిపదికన మాది చిన్న కులం. మా న్యాయమైన కోరికలను సైతం గట్టిగా నిలదీసి అడగలేని బలహీనులం. నేటి పాలకులకు మేమంటే చాలా చిన్నచూపు’ అంటూ వారు ఆవేదనగా చెప్పారు. ‘ఇప్పటివరకు ఏలిన పాలకుల్లో మాకు అత్యంత సాయం చేసింది మీ నాన్నగారైతే.. మమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసింది చంద్రబాబుగారే. బాబుగారు బీసీల పక్షపాతినంటూ మభ్యపెడుతూ... మా జీవితాలలో వెలుగులు నింపే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి మహత్తరమైన పథకాలను నిర్వీర్యం చేసి, మాకు ముష్టి వేసినట్టు పెట్టె, కత్తెర ఇచ్చి పల్లెలకు పోయి పనిచేసుకోండి అనడం మమ్మల్ని మరింత అవమానించడమే.

మమ్మల్ని ఎప్పటికీ వెనుకబాటుతనంలో ఉంచడమే ఆయన ఆలోచన’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేసింది మీ నాన్నగారే. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో మాలో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. మా కులస్తులకు ఒక జడ్పీ చైర్మన్, మున్సిపల్‌ చైర్మన్‌ పదవి వచ్చాయంటే అది ఆయన చలవే. చంద్రబాబుగారు ఒక్కటంటే ఒక్క పదవీ ఇచ్చిన పాపానపోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వారికి మన చట్టసభలలో ప్రాతినిధ్యమే లేకపోవడం చాలా బాధాకరం. వారికి సరైన గుర్తింపు, గౌరవం, ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో వారిని అన్ని రకాలుగా ఆదుకోవడంతోపాటు చట్ట సభలలోనూ, ఆలయాల పాలకమండళ్లలోనూ స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చాను.  
 
ప్రతిభ ఎంత ఉన్నా ప్రోత్సాహం కరువు.. అవార్డులు ఎన్ని గెలిచినా అవస్థలు తప్పడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చింది వెయిట్‌లిఫ్టర్‌ శిరోమణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించినా ప్రోత్సాహానికి నోచుకోలేకపోతున్నానంది. దేశానికి కామన్‌వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించినా మన రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌కు సైతం నోచుకోని దురవస్థ తనది అని బాధపడింది. ‘ఈ పాలనలో రికమండేషన్లదే రాజ్యం. శిక్షణ కోసం స్టేడియానికి వెళ్తే అక్కడ కూడా తక్కువ కులమంటూ వివక్ష. బీసీలంటే చిన్నచూపన్నా’ అంటూ ఆక్రోశం వెలిబుచ్చింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో సైతం స్వార్థ రాజకీయ ప్రయోజనాలను, పబ్లిసిటీని ఆశించే పాలకులున్నంత కాలం ఇలాంటి చెల్లెమ్మలకు చేయూత ఎండమావే.  
 
ఐదో తరగతి చదువుతున్న వేణుక అనే చిట్టితల్లి స్వహస్తాలతో రాసుకొచ్చిన ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టింది. ‘మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మాలాంటి ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడతావని కోరుకుంటున్నా’ అన్న ఆ అక్షరాలు మనసును కదిలించివేశాయి.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి పథకాలను సమర్థంగా అమలుచేసి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడకుండా చిన్నచిన్న తాయిలాలిచ్చి అదే అభివృద్ధి అని వారిని మభ్యపెట్టడం ధర్మమేనా? బలహీనవర్గాలను ఎప్పటికీ అలాగే ఉంచాలనుకునే మీ నైజానికి... బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులుగా పనికిరారంటూ మీరు పంపిన తప్పుడు నివేదికే నిదర్శనం కాదా?
- వైయ‌స్‌ జగన్‌ 

Back to Top