ఇప్పుడా రేసుగుర్రం కంచర గాడిదైంది

జమ్మలమడుగు: 2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తాను రేసుగుర్రాన్ని, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కంచర గాడిదని చెప్పారని...ఇప్పుడు ఆ రేసుగుర్రం పార్టీ ఫిరాయించి కంచర గాడిదగా మారిందని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. జమ్మలముడుగులో టీడీపీకి చెందిన   200 కుటుంబాలు అవినాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాయి. నైతిక విలువలు గల వ్యక్తినంటూ గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే ....పార్టీ మారి వందరోజులైనా ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 

విలువల్లేని నాయకులు కాకుండా నిరాడంబరులైనా వారిని రాజకీయాల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌గా ఉన్న సుధీర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని లక్ష్యంతోనే సుధీర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. అదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారని తెలిపారు. బాబు మాఫీ మాయజాలంతో మహిళలు, రైతులు రోడ్డున పడ్డారన్నారు. 
Back to Top