ముద్రగడ పట్ల ఇంత కర్కశమా

  • ముద్రగడది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం గల కుటుంబం
  • ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం
  • కుటుంబసభ్యులను అసభ్యపదజాలంతో దూషించారు
  • ఆయన కొడుకును దారుణంగా కొట్టారు
  • ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చమంటే ఇంత అమానుషమా
  • ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలిః ఉమ్మారెడ్డి

  • హైదరాబాద్ః  ముద్రగడ దీక్ష పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషమని శాసనమండలిలో వైయస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ముద్రగడ దీక్ష చేస్తే...ఆయన పట్ల టీడీపీ కర్కశంగా ప్రవర్తించిందని ఉమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. 13 రోజుల దీక్ష అనంతరం కిర్లంపూడికి వచ్చిన ముద్రగడ .....దీక్ష విరమింపజేసే సమయంలో ఆయన మాట్లాడిన మాటలు హృదయవిదారకంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు. 

    కనీసం బయట ఏం జరుగుతుందో పౌరుడిగా తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. పత్రికలు చదవనీయలేదు. టీవీ చూడనీయలేదు. చేసిన వాగ్ధానాలు నెరవేర్చమని పోరాడుతుంటే అనేక విధాలుగా ఆటంకం కలగజేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా బీసీల్లో చేర్చే విషయంలో , ఇస్తామన్న నిధుల విషయంలో ..... రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో వాగ్ధానాలు ఏమయినయని ముద్రగడ అడిగారు. తునిలో సమావేశం పెట్టి కాపుల సమస్యల గురించి, ఉద్యమం ఉద్దేశ్యం గురించి ఆయన చెప్పారు.  అక్కడ జరిగిన సంఘటనకు బాధ్యుడిగా నన్ను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. ఆయన దీక్ష విరమింపజేసే సమయంలో ...హామీలు నెరవేరుస్తామని, ఎవరి మీద చర్యలుండవని మంత్రులు వాగ్ధానం చేసిన విషయాన్ని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు.  

    ఇచ్చిన హామీని విస్మరించి, మళ్లీ అరెస్ట్ లు చేయడం వల్లే ముద్రగడ మరోసారి ఆమరణ దీక్ష చేపట్టారని ఉమ్మారెడ్డి తెలిపారు. తలుపులు వేసుకొని ఉద్యమం చేస్తుంటే... దీక్ష చేపట్టి కనీసం రెండు మూడు గంటలు గడవకుండానే తలుపులు పగులగొట్టి పోలీసులు ఇంట్లోకి వచ్చారు. తనను పోలీసులు తీసుకెళ్లడమే గాకుండా... కుటుంబసభ్యులు, బంధువులను  అసభ్య పదజాలంతో దూషించారు. తన కొడుకును దారుణంగా కొట్టారని ముద్రగడ మాట్లాడిన మాటలు ఆవేదన కలిగించాయన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

    ముద్రగడ పద్మనాభం ఓ వ్యక్తి మాత్రమే కాదని వ్యవస్థ లాంటి వారని ఉమ్మారెడ్డి అన్నారు. మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ నేపథ్యం గల వ్యక్తి ముద్రగడదని చెప్పారు. పద్మనాభం  6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయన పట్ల కర్కశంగా వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఆయన్ను చూసేందుకు, పలకరించేందుకు కూడా హాస్పిటల్  లోపలికి రాకుండా చేశారని, తమతో పాటు అక్కడకు వచ్చిన వారందరినీ హోటళ్లు, ఎయిర్ పోర్ట్ లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించాలని ఉమ్మారెడ్డి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న సమాచారాన్ని కూడా ఇవ్వకుండా చేసిన విధానం చూస్తే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తోందన్నారు. 
Back to Top