కేసీఆర్ అనుమతితో హైదరాబాద్ కు చంద్రబాబు

కేసీఆర్ బెయిల్ కండీషన్ పై చంద్రబాబు పాలన
పోలీసులు, రౌడీ ఎమ్మెల్యేలతో అణచివేత ధోరణి
పైశాచికంగా పత్రికలు,టీవీల గొంతు నొక్కుతున్నాడు

హైదరాబాద్ః సిగ్గుమాలిన పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు మూన్నెళ్ల తర్వాత కేసీఆర్ పర్మీషన్ తో హైదరాబాద్ వెళ్లారని ఎద్దేవా చేశారు. తనను అరెస్ట్ చేసిన మరుక్షణం కేసీఆర్ ప్రభుత్వం  కూలిపోద్దని, సెక్షన్ 8 అమలు చేయాలని, తనకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారని  అరిచిన చంద్రబాబు..ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.సెక్రటేరియట్ లో ఎల్,హెచ్ బ్లాకులు, లేక్ వ్యూగెస్ట్ హౌస్ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు...అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.

హైదరాబాద్ రావడానికి కేసీఆర్ అనుమతి తీసుకునే పరిస్థితికి చంద్రబాబు దిగజారారని అంబటి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఇచ్చిన బెయిల్ కండీషన్ మీద ఏపీని పాలిస్తున్న చంద్రబాబుకు వైఎస్ జగన్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్ పర్మీషన్ తోనే చంద్రబాబు హైదరాబాద్ టూర్ ఆధారపడి ఉందన్నారు. ఇందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మధ్యవర్తిత్వం నడుపుతున్నారని చెప్పారు. కేసులున్నందునే చంద్రబాబు కేసీఆర్ వైపు చూస్తున్నారని,  ఆతర్వాత సమయం చూసి కాటు వేస్తారన్నారు.

చంద్రబాబు తన అవినీతిని బయటపెడుతున్న పత్రికలు, టీవీల గొంతు నొక్కుతున్నాడని అంబటి విరుచుకుపడ్డారు. తమ దొంగతనాలన్నీ బయటకు వస్తాయనే,  తనకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను చదవొద్దని చంద్రబాబు చెబుతున్నారన్నారు. వందల కోట్లు బినామీలు పెట్టి చంద్రబాబు తనకు అనుకూలంగా కొన్ని పేపర్లలో వార్తలు రాయించుకోవడం వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన తనయుడు స్టూడియోన్ ను నడిపించలేక చేతులు కాల్చుకున్నారని అన్నారు. తమకు అనుకూలంగా లేదని ఎన్టీవీని 13 జిల్లాల్లో కొన్నాళ్ల పాటు ఆపేశారన్నారు. చంద్రబాబు లాగా వైఎస్ జగన్ బినామీ ఛానల్ లు పెట్టలేదన్నారు.  

న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తిస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు.  సమస్యలు చెప్పుకుందామని వచ్చిన కార్యకర్తలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ప్రవర్తించారన్నారు. పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా... డబుల్ బెడ్ రూంలు కట్టిస్తాం దాంట్లో సంపాదించుకోండి అంటూ  అవమానించడం దుర్మార్గమన్నారు. వనజాక్షి విషయంలోనూ చంద్రబాబు చింతమనేనిని వెనకేసుకొచ్చారని అంబటి పైరయ్యారు. 

పోలీస్ వ్యవస్థ, రౌడీ ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని చంద్రబాబు అంగన్ వాడీల ఆందోళన అణచివేయాలని చూస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. నిర్దాక్షిణంగా పిన్నీసులు, సూదులు పట్టుకొని పొడుస్తూ అంగన్ వాడీలను వ్యానులో కుక్కుతున్నారని విమర్శించారు. మంత్రి యనమల రామకృష్ణడు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉపసంఘం పెంచిన జీతాలు అమలు చేస్తామని చెప్పారని, ఇచ్చిన హామీలను అమలు చేయనందునే నమ్మకం లేక జీవో ఇవ్వాలని అంగన్ వాడీలు కోరుతున్నారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top