వ్యవసాయం దండగ..సింగపూర్ కు పండగ

రైతులు, వ్యవసాయ కూలీలు ఏమైనా పర్వాలేదు కానీ సింగపూర్ సంస్థలు, వాటితో నల్లధనం లావాదేవీలు మాత్రం బాగుండాలని  అన్నది చంద్రబాబు మనస్ఫూర్తిగా నమ్మిన సిద్దాంతం. అందుకే దాన్ని అమలు చేసేందుకు ఆయన పాటు పడుతుంటారు.

 33వేల ఎకరాలకు పైగా భూమిని బలవంతంగా లాక్కొన్న చంద్రబాబు భూదాహం తీరటం లేదు. మిగిలిన రైతులనుంచి కూడా భూమిని లాక్కొనేందుకు ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు. 14 వందల ఎకరాల్లో భూమిని లాక్కొనేందుకు భూ సమీకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారు. కాలం చెల్లిన ఆర్డినెన్స్ ఆధారంగా భూములు లాక్కోవటం కుదరని పని. అది తెలిసి కూడా చంద్రబాబు రైతుల్ని మానసికంగా వేధించి భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ అస్త్రాన్ని ఉపయోగించబోతున్నారు.

 రైతుల్ని భయపెట్టేందుకు ఆయన ఎంచుకొన్న మరో మార్గం పంట పొలాల్ని తగలబెట్టడం. గత డిసెంబర్ లో ఒకసారి భూములు ఇవ్వని రైతుల పంట పొలాల్ని తగలబెట్టారు. దీంతో భయపడి పోయిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు తమ భూముల్ని అప్పగించేశారు. ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్రయోగిస్తున్నారు.

 రైతుల్ని భయ పెట్టేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లును వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు 29మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే. మామూలుగా ఒక జిల్లాకు ముగ్గురు, నలుగురు మాత్రమే డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తారు. అంటే దాదాపు 10 మండలాలకు ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటారు. అటువంటి స్థాయి ఉన్న అధికారిని గ్రామానికి ఒకరిని నియమించి మరీ భూములు లాక్కొనేందుకు పథక రచన చేశారు. ఇప్పుడు ఆ డిప్యూటీ కలెక్టర్లను, పోలీసు అధికారులను రైతుల ఇంటి మీదకు పంపించి దౌర్జన్యాలు చేస్తున్నారు.

మొత్తం మీద రైతుల నుంచి భూములు లాగేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అందరినీ కలవరపాటుకి గురి చేస్తున్నాయి. 

Back to Top