వ్యవసాయం దండగన్నారు

దాడితోట: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఆయన రాసిన పుస్తకంలోనే బహిర్గతమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పేర్కొన్నారు. అనంతపురం జిల్లా దాడితోటలో మంగళవారం ఏర్పాటైన సభలో ఆమె ప్రసంగించారు. వ్యవసాయం దండగనీ, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనీ అందులో రాసుకున్నారని వివరించారు. ఉచితంగా ఏదైనా ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారన్నది ఆయన అభిప్రాయమని వ్యంగ్యోక్తి విసిరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే చంద్రబాబు హయాంలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, ప్రస్తుతం అవే పరిస్థితులు నెలకొన్నాయనీ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కరెంటు ఛార్జీలను ఎన్నిసార్లు పెంచారు? అంటూ ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలను పెంచినపుడు వైయస్ఆర్ నిరాహారదీక్ష చేశారని చెప్పారు. కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై చంద్రబాబు కాల్పులు జరిపించి, పలువురి ప్రాణాలు హరించారని తెలిపారు. అనంతరం చంద్రబాబు మృతుల కుటుంబీకులను కాకుండా, వారిని కాల్చిన పోలీసులను పరామర్శించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. నాటకాలాడుతూ పాదయాత్ర చేస్తున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టలేదనీ నిలిదీశారు. ప్రస్తుతం పాలక కాంగ్రెస్ పార్టీతో కలిసి కుమ్మక్కయ్యారనీ, ఇందుకు ఎన్నో ఆధారాలున్నాయనీ తెలిసారు. సీబీఐని వాడుకుని జగనన్నను బయటకు రాకుండా చేయడం ఇందులో ఒకటని స్పష్టంచేశారు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. మంచి వాళ్ళ పక్షాన నిలబడతారనేది అంతే నిజం. ఆయనే జగనన్నను బయటకు తీసుకొస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
జనమ్మోహనం.. దాడితోట చేరుకున్న షర్మిలకు జనసంద్రం ఘన స్వాగతం పలికింది. ఆమె వెంట పల్లెలు నడిచివచ్చాయి. జగన్నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది.

Back to Top