విశ్వసనీయత లేని నేత

హైదరాబాద్,12 అక్టోబర్ 2012 : చంద్రబాబుకు విశ్వసనీయత అన్నమాటే లేదని టిడిపి సీనియర్‌ నాయకుడు సంకినేని వెంకటేశ్వర రావు విమర్శించారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతోనైతే తెలుగుదేశం పార్టీని పెట్టారో అందుకు భిన్నంగా చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బాబు తీరుకు విసిగి తాను పార్టీని నీడుతున్నాననీ ఆయన శుక్రవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద మీడియాకు చెప్పారు. టిడిపి అధినేత అవకాశవాద మోసకారి ధోరణి వల్ల తెలంగాణలో పార్టీ భ్రష్టు పట్టిపోయిందనీ, ఈ రాష్ట్రంలో విశ్వసనీయత అసలే లేని నాయకుడెవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబేననీ ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌ రెడ్డిని జైలులోనే ఉంచాలన్న కుట్రపూరితవైఖరితో  చంద్రబాబు కాంగ్రెస్‌ నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మీకు మద్దతు ఇస్తాం, రాష్ట్రంలో మాకు మద్దతు పలకండి అన్నట్లుగా చంద్రబాబు ధోరణి ఉందని ఆయన విమర్శించారు. 
తనకు 2009 ఎన్నికలలో పోటీ చేయడానికి బాబు టిడిపి బి ఫారమ్‌ ఇచ్చినా టిఆర్ఎస్‌ కోసం దానిని ఉపసంహరించు కున్నారనీ, ఆ తర్వాత తుంగతుర్తి టికెట్‌ ఇస్తామని మోసం చేశారనీ వెంకటేశ్వర రావు చెప్పారు. నల్లగొండ జిల్లాలో నర్సింహులు వంటి నోటి దురుసు నాయకులను బాబు ప్రోత్సహిస్తున్నారని ఆయన నిందించారు. ఎమ్మెల్సీ ఇస్తామంటూ బాబు చాలా మాటలు చెబుతూ వచ్చారనీ, అయితే ప్రజాజీవనంలో చురుకైన పాత్ర పోషించేందుకే తాను వైయస్‌ఆర్ సిపిలో చేరుతున్నాననీ ఆయన తెలిపారు. నవంబర్ 11-15 తేదీల మధ్య సూర్యాపేటలో బహిరంగసభను నిర్వహిస్తామనీ, అక్కడే వైయస్‌ఆర్ సిపిలో తన అనుచరులతో కలిసి చేరతాననీ ఆయన చెప్పారు. అన్న మాటకు కట్టుబడి ఉండే వైయస్‌ కుటుంబం విశ్వసనీయత పట్ల తాను ఆకర్షితుడైనానని ఆయన వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రజోపకరమైన పనులతో వైయస్‌ రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారనీ, ఆ పథకాలను మెరుగైన పద్ధతిలో అమలు చేసేందుకు జగన్‌ కట్టుబడి ఉన్నారనీ ఆయన వ్యాఖ్యానించారు.

Back to Top