విజయమ్మ ఫీజు దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు

హైదరాబాద్‌, 6 సెప్టెంబర్‌ 2012 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎలాంటి మార్పులూ చేయకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయస్ విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సంఘీభావంగా నిలిచారు. వారంతా రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాల్లో కూడా ఫీజు దీక్షలు ప్రారంభించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు విజయమ్మకు బాసటగా దీక్ష చేపట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విద్యార్థులకు తోడుగా ఫీజు దీక్షలో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేసే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ విద్యార్థులు మద్దతు తెలిపారు. నగరంలోని సర్పవరం జంక్షన్‌ వద్ద దీక్ష చేపట్టిన విద్యార్థులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంఘీభావం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విజయమ్మ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని పలువురు వక్తలు మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top