విజయమ్మ లేఖకు కేంద్ర మంత్రి స్పందన

హైదరాబాద్:

నార్వేలో పిల్లలను హింసించారన్న ఆరోపణపై జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రశేఖర్ దంపతుల అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాసిన లేఖకు కేంద్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి వాయలార్ రవి శ్రీమతి విజయమ్మకు ఓ  లేఖ రాశారు. చంద్రశేఖర్ దంపతులకు కేంద్రం తరఫున సాధ్యమైనంత మేరకు సాయం అందిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ టీసీఎస్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. నార్వేలో కుటుంబంతో ఉన్నారు. అక్కడ ఉన్న సమయంలో ఆయన కుమారుడు పాఠశాల బస్సులో వ్యవహరించిన తీరు కారణంగా ఉపాధ్యాయిని అతడిని పిల్లల సంక్షేమ గృహానికి పంపించారు. అక్కడ అతడితో మాట్లాడిన తర్వాత నిర్థారించుకున్న అంశాలతో పోలీసులు చంద్రశేఖర్ దంపతులపై కేసు పెట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేల్చి చంద్రశేఖర్‌కు పద్దెనిమిది నెలలు, అతడి భార్యకు పదిహేను నెలలు జైలు శిక్ష విధించారు. ఈ అంశంపై వారి బంధువులు గత నెలలో శ్రీమతి విజయమ్మను కలిశారు. తమకు సాయపడ వలసిందిగా విన్నవించుకున్నారు. దీనిని పురస్కరించుకుని ఆమె కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. చంద్రశేఖర్ దంపతుల విడుదలకు కృషిచేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ఈ లేఖకు స్పందించిన వాయలార్ రవి శ్రీమతి విజయమ్మకు సమాధానం పంపారు.

తాజా వీడియోలు

Back to Top