విహెచ్ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం

తిరుపతి, 16 ఏప్రిల్‌ 2013: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యల వెనక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు‌ భూమన కరుణాకరరెడ్డి, ఎన్.అమర్నా‌థరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలే‌ మహానేత వైయస్ కుటుంబంపై ‌ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. వి.హెచ్ ఒక బ్రోక‌ర్‌ అని, తన భార్య చేత కూడా ఓటు వేయించుకోలేని వ్యక్తి అని వారు ఎద్దేవా చేశారు. ఇలాంటి కుట్రలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బెదిరే ప్రసక్తే లేదన్నారు. ఏ జైలులో అయినా నిబంధనలు ఒక్కటేనని వారు చెప్పారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఎక్కడ ఉన్నా నేతలు కలుస్తూనే ఉంటారన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దినదిన ప్రవర్ధమానమవుతున్న ప్రచండ భానుడు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. రాజకీయాల్లో ఆయనొక సరికొత్త ప్రభంజనం అన్నారు. ప్రభుత్వంలో ఏనాడూ కొంచెమైనా భాగస్వామి కాని, సెక్రటేరియట్‌ ముఖం కూడా చూడని, ఒక్క ఐఎఎస్‌ అధికారితోనైనా మాట్లాడని వ్యక్తి శ్రీ జగన్‌ అన్నారు. ఇలాంటి శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద ఇంత ద్వేషాన్ని కడుపు నిండా నింపుకుని మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్‌, టిడిపిలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సంపూర్తిగా సమాధి కట్టబోతున్నదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. ఆ భయంతో, బాధతో ఇలాంటి ప్రేలాపనలు వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి పైన, ఆయన కుటుంబంపైన ఒక పథకం ప్రకారం దాడి చేసే కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎన్‌. అమరనాథరెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌ పెద్దల దర్శకత్వంలోనే రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు ఇలాంటి మాటల దాడులు చేస్తున్నారన్నారు. శ్రీ వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోనే ఉంటే కాంగ్రెస్‌ పార్టీ మరింతగా ఖాళీ అయిపోతుందన్న భయం వల్లే వాళ్ళలో ఈ దురుద్దేశం ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

కాంగ్రెస్‌, టిడిపి నాయకులు, యెల్లో మీడియా ఒకే విధంగా మాట్లాడుతూ ఉంటారని మరో ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. శ్రీ జగన్‌ మీద కేసులు పెట్టే ముందు కూడా ఇలాగా మాట్లాడారన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా కుమ్మక్కై మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీ జగన్‌ను ఎక్కడికి పంపించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీ జగన్‌ను మరో రాష్ట్రానికి పంపించాలనుకుంటే.. సోనియాను ఇటలీ పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top