'విద్యుత్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలి'

హైదరాబాద్‌, 20 మార్చి 2013: విద్యుత్ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంటు కోతలకు నిరసనగా వారు బుధవారంనాడు విద్యుత్‌ బిల్లులు పట్టుకుని, నల్లబ్యాడ్జీలు ధరించి శాసనసభకు హాజరయ్యారు.

అసెంబ్లీకి హాజరు కావడానికి ముందు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఛార్జీల పేరిట ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, పెంచిన విద్యుత్‌ చార్జీలు, సర్‌ ఛార్జీలను తగ్గించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సమస్యలపై తాము శాసనసభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చామన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం టిడిపి సహకారంతో శాసనసభను సక్రమంగా నడపడంలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని శోభా నాగిరెడ్డి ‌ఆరోపించారు. విద్యుత్ సంక్షోభం కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమలు కుదేలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని‌ శోభా నాగిరెడ్డి గుర్తు చేశారు. రైతులకు‌ ఆయన ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందించారని ఆమె అన్నారు.
Back to Top