కాంగ్రెస్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా టీడీపీ

హైదరాబాద్:

కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ పునరావాస కేంద్రంగా టీడీపీ మారిపోయిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. టీడీపీకి ఎమ్మెల్యేలు కరవయ్యారని అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన, వెళ్ళగొట్టబడిన వారిని చంద్రబాబు తన పార్టీలో ఆశ్రయం కల్పిస్తున్నారని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్‌పై మోజు తగ్గినట్లు లేదని పద్మ వ్యాఖ్యానించారు. టీడీపీలో చేరుతున్న వారిని చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.‌ లీడర్లు తప్ప కేడర్ లేని పార్టీ కాంగ్రె‌స్ అని ఆమె అభివర్ణించారు.

టీడీపీకి కేడర్‌తో పాటు,  ఎమ్మెల్యేలు ఎవరూ లేనట్లు ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్ వారిని చంద్రబాబు నాయుడు పెద్ద బలంగా భావిస్తున్నారని ‌పద్మ అన్నారు. సోనియా, చంద్రబాబులది ఒకే విధానం అని, శ్రీ వైయస్‌ జగన్‌ను ఏ విధంగా దెబ్బతీయాలనే దానిపైనే వారు కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీడీపీ ఇక తన దుకాణాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. ప్రజల కోసం పాటుపడాలని చంద్రబాబుకు ఏనాడూ అనుకోలేదు కాని, టీడీపీలో చేరిన వారికి పచ్చ జెండాలు కప్పడానికి మాత్రం చేతులు వస్తున్నాయని పద్మ విమర్శించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీని ఎవరూ నమ్మడం లేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Back to Top