వరద బాధితుల పరామర్శకు విజయమ్మ

హైదరాబాద్

4 నవంబర్ 2012 : భారీ వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్న ప్రజలను కలిసి, బాధితులను పరామర్శించాలని వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మ నిర్ణయించారు. వరదబాధితుల పరామర్శ కొరకు ఆమె సోమవారం కృష్ణా, తూర్పు, పశ్చిమ
గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుండి నేరుగా విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా ఏలూరు వెళతారు. ఏలూరులో ముంపు బారిన బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుండ్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటిస్తారు. ఆ తర్వాత కృష్ణాజిల్లాలోనూ పర్యటించనున్నారు.
బాధితులకు తక్షణ సహాయం అందించాలని
ఆమె ఇప్పటికే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు కష్టంలో ఉన్నారనీ, వారిని ఆదుకునేందుకు పార్టీశ్రేణులు కదలాలని ఆమె ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. వరద బాధిత ప్రాతాలకు తాను వెళుతున్నానని ఆమె చెప్పారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజల మధ్య ఉండి పని చేయాలని ఆమె సూచించారు. ఆమె ఎప్పటికప్పుడు
వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో వరదల తీవ్రతపై  వైయస్ఆర్ సీపీ నాయకులతో చర్చిస్తున్నారు. ముంపు పరిస్థితులపై ఆదివారం విజయమ్మ ఆరా తీసి, ఆయా జిల్లాల పార్టీ కో-ఆర్డినేటర్లతో ఆమె మాట్లాడారు. బాధితులను ఆదుకునేందుకు సాయం చేయాలని పార్టీ వర్గాలను ఆమె కోరారు. ఆమె ఆదేశాలపై ఇప్పటికే పలువురు వైయస్ఆర్ సీపీ నాయకులు ఆయా జిల్లాలలో వరద ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. అనకాపల్లిలో సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో బాధితులకు అందించవలసిన సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించకోవడంతో ముంపు తీవ్రత ఎక్కువగా ఉందని, బాధితులకు సహాయం సరిగా అందడం లేదని, ప్రభుత్వంలో కదలిక లేదని ఆయన మీడియాతో అన్నారు.

Back to Top