వలసలకు కారణం నీటి కరవే

నెట్టెంపాడు:

పాలమూరు జిల్లాలో నాలుగు సాగునీటి ప్రాజెక్టులను తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ 75 శాతం వరకు పూర్తి చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చెప్పారు. మిగిలిన పని పూర్తిచేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఈ కారణంగా నీరు లేక, కూలీ దొరక్క మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వలసల బాట పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దత్తత తీసుకున్నా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయిందన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమంటే డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. జగనన్న త్వరలో వస్తాడనీ, ప్రతి ఇంటినీ సంతోషంగా ఉంచుతాడనీ ఆమె పేర్కొన్నారు. గురువారం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 43వ రోజు ముగిసింది. శ్రీమతి షర్మిల మొత్తం 589 కిలోమీటర్లు నడిచారు.
 పంటలు పండించడానికి నీరు లేక, చేసేందుకు కూలి పనులు లేక పాలమూరు జిల్లావాసులంతా బతుకుదెరువు కోసం వలసపోతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులుండి.. నీళ్లు పారి.. పంటలు పండితే ఈ అగత్యమే ఉండదన్నారు.  జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామమవుతుందని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తపించేవారన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా వైయస్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన నెట్టెంపాడు వద్దకు షర్మిల వెళ్లారు. ఆ ప్రాజెక్టును పరిశీలిస్తున్నప్పుడు.. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకురావడంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం చూసి స్థానిక నాయకులు ఓదార్చడానికి యత్నించారు.
ఊరువిడిచి వెడతాం..
    షర్మిల నందిమళ్ళ గ్రామంలో గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు.. సాగు లేక, కూలీ పనులు లేక వలసలు పోతున్నామని స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఎల్లన్న, తిమ్మయ్య అనే కూలీలు తమ గోడు చెప్తూ ఊరు విడిచి వెళ్ళపోతాయని బాధ పడటంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘పాలమూరు జిల్లా వాళ్లు త్యాగమూర్తులు అని నాన్న ఎప్పుడూ చెప్పేవారన్నారు. ఎందుకు నాన్నా అని అడిగితే..! ఇది కరవు జిల్లా.. పంటలు సరిగా పండవు. కూలీపని కూడా దొరకదు. ‘నా అన్నదమ్ములు కుటుంబాన్ని వదిలి దేశం కాని దేశాలకు వలస పోతారు. అక్కడ పస్తులు ఉండైనా సరే నాలుగు డబ్బులు సంపాదించి వాళ్ల కుటుంబ సభ్యుల కోసం పంపుతారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు కానీ ప్రయోజనం లేదు. జిల్లా ప్రజల కోసం ఏమీ చేయలేదు. కనీసం వలసలను కూడా ఆపలేకపోయారు’ అని నాన్న బాధపడేవారు’’ అని షర్మిల గుర్తుచేసుకున్నారు.

Back to Top