అనంతపురం
: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం అనంతపురంలోని సిండికేట్ నగర్ చేరింది. అక్కడి చేనేత కుటుంబాలకు చెందిన మహిళలు ఆమెను కలిసి తమ కష్టాలు ఏకరువు పెట్టారు. రెండేళ్ళుగా తమ పరిస్థితి దయనీయంగా ఉందని వారు ఆమెకు చెప్పారు. పట్టు చీరలకు గిట్టుబాటు లభించడం లేదనీ, చేనేతను ఆదుకునే దిక్కులేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లు రద్దు చేస్తున్నారనీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదనీ వాపోయారు.
చేనేతలకు రుణాలు రద్దు చేస్తామని జగననన్న ఎప్పుడో చెప్పారని షర్మిల మహిళలకు తెలిపారు. చంద్రబాబు హయాంలో నాలుగువేల మంది రైతులు, వందలాది మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, వారి కుటుంబాలకు రైతు కుటుంబానికి లక్ష, నేతన్న కుటుంబానికి లక్షన్నర చొప్పున ఇచ్చి ఆదుకున్నారనీ షర్మిల వివరించారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాల్లో అతి గొప్పది అభయ హస్తమని పేర్కొన్నారు. వైయస్ చేనేతలకు రూ 312కోట్ల బకాయిలు రద్దు చేయాలని సంకల్పించారన్నారు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించడంతో ఆ యోచన మూలన పడిందన్నారు. వైయస్ఆర్ పింఛన్లిచ్చి ఆదుకున్నారన్నారు. 50ఏళ్ళ వయసుకే పింఛన్లిచ్చిన ఘనత ఆయనదన్నారు. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసే సమర్థత జగన్ కే ఉంది. చేనేతల కష్టాలు తీరాలని జగనన్న 103 డిగ్రీల జ్వరంలో సైతం దీక్ష చేసిన విషయాన్ని షర్మిల మహిళలకు గుర్తుచేశారు. 'చేనేత కుటుంబంలో భార్యభర్త ఇద్దరూ కష్టపడినా 130 రూపాయలు మిగులుతుందట. ఈ మొత్తంతో వాళ్ళెలా బతకాలాని వైయస్ నిరంతరం మధనపడేవారు. జగనన్నకు చేనేతలంటే ఎంతో గౌరవం. వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తానని జగన్ చెప్పాడు. నేసిన బట్టకు గిరాకీ కల్సించడానికి, ఉపాధి పెంచడానికీ ప్రయత్నిస్తాడు. అభయహస్తం పెడితే ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది. జగన్ వైయస్ఆర్ కొడుకు. అన్ని పథకాలూ ఇస్తాడు.' అని షర్మిల వారికి హామీ ఇచ్చారు. మీకోసం పోరాడతామనీ, అధికారంలోకి వచ్చాక మీ కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామనీ షర్మిల పేర్కొన్నారు.