<strong>హైదరాబాద్, 14 నవంబర్ 2012:</strong> మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి రూపొందించి, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.కె. మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అశేషంగా హాజరవుతున్న జనంతో ఒక జాతరలా కొనసాగుతోందని ఆయన అభివర్ణించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం కోసం తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు.<br/>ఓదార్పు యాత్ర స్ఫూర్తితో మరో ప్రజాప్రస్థానానికి కూడా ఖమ్మంజిల్లా ప్రజలు బ్రహ్మరథం పడతారని పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను అధికార, ప్రధాన ప్రతిపక్షాలు గాలికి వదిలేశాయని అజయ్ కుమార్ దుయ్యబట్టారు. ప్రజల పక్షాన నిలబడింది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పారు. మరో ప్రజాప్రస్థానం కోసం తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారని పార్టీ యువ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.<br/>వైయస్ పథకాల వల్ల ఎక్కువగా లాభం పొందింది తెలంగాణ ప్రజలే అని పార్టీ నాయకుడు రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంతో పాటు అభివృద్ధినీ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం అవుతుందన్నారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈ తెలంగాణ నాయకులు పాల్గొన్నారు.<br/>