'వైఎస్ మీద కక్షతోనే విద్యార్థులకు వేధింపులు'

హైదరాబాద్‌, 7 సెప్టెంబర్‌ 2012: ఉన్నత చదువులు పేదల హక్కుగా ప్రభుత్వం భావించటం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ‌వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఫీజు దీక్ష చేస్తున్న ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌పై కక్ష పెంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెం‌ట్‌ను ఎలాగైనా ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. ఫీజు పథకం సక్రమంగా అమలు అవుతోందని ఈ సీఎం, మంత్రులు చెప్పగలరా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చేవలేదని, చేతగానిదని విజయమ్మ విమర్శించారు. నిరుపేదలకు ఏం చేయాలో, ఎలా చేయాలో వైయస్ నిరూపించార‌ని విజయమ్మ అన్నారు. చదువులపై ‌చేసే ఖర్చును వైయస్ సామాజిక పెట్టుబడిగా భావించారన్నారు. అదే వైయస్ విజ‌న్ అని ఆమె అన్నారు. చంద్రబాబునాయుడు ఫీజు రీయింబ‌ర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ‌ఒక్క విద్యార్థి అయినా చెబుతారా అని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. బీసీల పట్ల బాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గత ఎన్నికల్లోనే చూశామని విజయమ్మ వ్యాఖ్యానించారు.

Back to Top