'వైయస్ జగన్ సీఎం అవుతారు'

హైదరాబాద్, 21 డిసెంబర్ 2012:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలోగా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి 40వ పుట్టిన రోజు సందర్భంగా కూకట్‌పల్లిలో శుక్రవారంనాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పేద ప్రజల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, కడప మాజీ మేయర్ రవీంధ్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top