వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఐఎన్‌టీయూసీ నాయకుల చేరిక

తిరుపతి:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి మహిళలకు భరోసా కల్పించే ధీశాలని  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఐఎన్‌టీయూసీ తిరుపతి నగర అధ్యక్షుడు కేతం జయచంద్రారెడ్డి(రామారావు) నాయకత్వంలో వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శరద్ యాదవ్, ఐఎన్‌టీయూసీ నగర ఉపాధ్యక్షుడు బాలు, ఇంకా ఐఎన్‌టీయూసీకి చెందిన ముఖ్య నాయకులు బాబురెడ్డి, నాదముని రెడ్డి, పార్థసారథి రెడ్డి, కరుణాకర్‌తోపాటు వారి సహచరులు, విద్యార్థి సంఘాల నాయకులు చేరారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని మూడు వేల కోట్ల రూపాయల రుణాలను పావలా వడ్డీకి ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలకు గ్యాస్ భారం లేకుండా చేశారని గుర్తుచేశారు. అన్నదాతలను రుణాల భారం నుంచి కాపాడేందుకు రూ.1,200 కోట్ల రుణాలను మాఫీ చేశారని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే  వృద్ధుల రూ.700, వికలాంగులకు రూ.1000 పింఛన్ అందజేస్తారని తెలిపారు. మహిళలకు పైసా వడ్డీ లేకుండా 25 వేల కోట్ల రూపాయల రుణాలను అందజేస్తారని హామీ ఇచ్చారు. అర్హులందరికీ తెల్ల రేషను కార్డులు ఇచ్చి, 15 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ పట్ణణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు.  కేతం జయచంద్రారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తిరుపతయ్య, పుల్లయ్య ప్రసంగించగా, పార్టీ నాయకులు ఎంవీఎస్. మణి, తొండమనాటి వెంకటేష్, న్యాయ విభాగం కన్వీనర్ యుగంధర్, ఎస్సీ సెల్ విభాగం కన్వీనర్ రాజేంద్ర, జ్యోతిప్రకాష్, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top