<strong>సూర్యాపేట (నల్లగొండ జిల్లా)</strong>, 11 నవంబర్ 2012: రాష్ట్రంలో త్వరలో రాబోయేది వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే, టిడిపి మాజీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అమలు కావాలంటే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేద వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో బలమైన నాయకుడిగా ఉన్న ఆయన ఆదివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలిస్తున్న సంకినేని కాసేపు మీడియాతో మాట్లాడారు. వైయస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.<br/>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పట్ల ఎనలేని ఆదరణ పెరుగుతుండడానికి, జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు భావిస్తున్నారనడానికి సూర్యాపేటలో జరుగుతున్న సభకు హాజరవుతున్న జనమే సాక్షి అని సంకినేని అభివర్ణించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టి, కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని గుర్తుచేశారు. అందుకే ఈ రాష్ట్రంలో రాబోయేది రాజశేఖరరెడ్డి ప్రభుత్వమని అన్నారు.